హైదరాబాద్ నగరంలో అత్యంత పురాతనమైన, పేరుగాంచిన సరస్సుల్లో హుస్సేన్ సాగర్ ఒకటి. ఈ సరస్సుకు 480 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా – IV ఈ సరస్సును నిర్మించాడు. ఒకప్పుడు ఈ సరస్సు హైదరాబాద్ నగరానికే తలమానికంగా ఉండేది. కానీ ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఈ క్రమంలోనే దేశంలోనే అత్యంత కాలుష్య భరితమైన సరస్సుల్లో హుస్సేన్ సాగర్ ఒకటిగా నిలిచింది.
హుస్సేన్ సాగర్ గురించిన పలు విషయాలు ఇప్పుడు సగటు నగర జీవిని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. గత 15 సంవత్సరాలుగా హుస్సేన్ సాగర్ శుద్ధి కోసం ప్రభుత్వాలు రూ.1034 కోట్ల వరకు ఖర్చు చేశాయి. కానీ అవేవీ ఫలితాలను ఇవ్వకపోగా, ఆ సరస్సులో పేరుకుపోతున్న కాలుష్య వ్యర్థాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. నిత్యం కొన్ని వందల టన్నుల కాలుష్య వ్యర్థాలు, మురుగు నీరు, విష పదార్థాలు హుస్సేన్ సాగర్‌లో కలుస్తున్నాయి.
హుస్సేన్ సాగర్ లో విష పదార్థాల పరిమాణం రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీంతో ఆ నీరు ఇప్పుడు విషతుల్యంగా మారింది. ఇక సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు హుస్సేన్ సాగర్ ను ఇ కేటగిరిలో, అత్యంత తక్కువ స్థాయి నాణ్యతా ప్రమాణాలు కలిగిన విభాగంలో చేర్చారు. 1998 నుంచి హుస్సేన్ సాగర్ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ఇప్పటి వరకు సుమారుగా రూ.1వేయి కోట్లకు పైగా ఖర్చు చేశారు. కానీ ఈ సరస్సు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
ఇక ప్రస్తుతం హుస్సేన్ సాగర్‌లో నిత్యం కొన్ని వందల టన్నుల వ్యర్థాలు, మరుగు నీరు కలుస్తున్నాయి. మరోవైపు విష పదార్థాలు పేరుకుపోతున్నాయి. దీంతో సరస్సులో కరిగిఉన్న ఆక్సిజన్ స్థాయిలు సున్నాకు చేరుకున్నాయి. ఇటువంటి పరిస్థితిలో సరస్సులో జలచరాలు బతికి ఉండే అవకాశం కూడా లేదని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఏది ఏమైనా.. హుస్సేన్ సాగర్ ను ఇప్పటికైనా పూర్తి స్థాయిలో శుద్ధి చేసి, ఇకపై ఎలాంటి వ్యర్థాలు కలవకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలపైనే ఉంది.