తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కించే ఎన్నిక రెడీనా..!

తెలంగాణ పాలిటిక్స్‌ను హీటెక్కించే ఎన్నిక‌కు రంగం సిద్ధం అవుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏప్రిల్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో న‌ల్ల‌గొండ నుంచి లోక్‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. దీంతో ఆయ‌న ఈ స్థానానికి రాజీనామా చేయ‌డంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ స్థానానికి త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ రానుంది.


తెలంగాణ‌లో ఇప్ప‌టికే గ‌త ఎడెనిమిది నెల‌లుగా వ‌రుస పెట్టి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. గ‌త డిసెంబ‌ర్‌లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌లు, ఏప్రిల్‌లో లోక్‌స‌భ ఎన్నిక‌లు, ఆ త‌ర్వాత మండ‌లాలు, జ‌డ్పీటీసీలు, పంచాయ‌తీ ఎన్నిక‌లు ఇలా వ‌రుస పెట్టి ఎన్నిక‌ల జాత‌ర న‌డుస్తోంది. ఇక అక్క‌డ మిగిలిన‌వి మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ ఎన్నిక‌లు మాత్ర‌మే. వీటిని కూడా త్వ‌ర‌లోనే నిర్వ‌హించాల‌ని జీవో జారీ చేయ‌డంతో త్వ‌ర‌లోనే కేసీఆర్ స‌ర్కార్ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ల‌కు కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు రెడీ అవుతోంది.

ఇక ఇప్పుడు వీట‌న్నింటిని మించేలా తెలంగాణ పాలిటిక్స్‌ను హీటెక్కించే ఎన్నిక‌కు రంగం సిద్ధం అవుతోంది. టీ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసిన హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ను అన్ని పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోనున్నాయి. గ‌త డిసెంబ‌ర్‌లో ఈ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏప్రిల్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో న‌ల్ల‌గొండ నుంచి లోక్‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. దీంతో ఆయ‌న ఈ స్థానానికి రాజీనామా చేయ‌డంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ స్థానానికి త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ రానుంది.

డిసెంబ‌ర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో హుజూర్‌న‌గ‌ర్‌లో హోరాహోరీ పోరు జ‌రిగినా టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీచేసిన శానంపూడి సైదిరెడ్డిపై ఉత్త‌మ్ 7 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ ఈ స్థానాన్ని ఒక్క‌సారి కూడా గెలుచుకోలేదు. ఇక జ‌డ్పీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ – కాంగ్రెస్ హోరాహోరీగా త‌ల‌ప‌డి స‌గం స‌గం సీట్లు గెలుచుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్య నాలుగు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉండటం గమనార్హం.

అదే నాలుగు నెల‌ల త‌ర్వాత జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల విష‌యానికి వ‌చ్చే స‌రికి సీన్ మారింది. ఇక్క‌డ కాంగ్రెస్‌కు మంచి మెజార్టీ వ‌చ్చింది. అంటే నాలుగు నెల‌ల్లోనే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపించింది. ఈ క్ర‌మంలోనే ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టీఆర్ఎస్ అభ్య‌ర్థి విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. ముందుగా కాంగ్రెస్ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాకే త‌మ పార్టీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాల‌ని చూస్తోంది.

కాంగ్రెస్ నుంచి ఉత్త‌మ్ భార్య ప‌ద్మావ‌తి పోటీ చేస్తారా ?  లేదా ఏ జానారెడ్డో లేదా ఇంకెవ‌రిని అయినా సీనియ‌ర్ల‌ను రంగంలోకి దింపుతారా ? అన్న‌ది చూడాలి. ఏదేమైనా ఉత్త‌మ్ ఇష్టాన్ని బ‌ట్టే ఇక్క‌డ అభ్య‌ర్థి ఎంపిక ఉంటుంది. అటు బీజేపీ కూడా ఈ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని… భారీగా ఓట్లు సాధించాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ సీటును ఎలాగైనా గెల‌వాల‌ని చూస్తోన్న టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థికంగా బ‌ల‌మైన అభ్య‌ర్థినే రంగంలోకి దింపుతార‌ని అంటున్నారు. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక తెలంగాణ పాలిటిక్స్‌ను హీటెక్కించ‌డం మాత్రం ఖాయం.