హైదరాబాద్ మెడలో మరో మణిహారంగా చేరిన కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం ఈరోజు జరగాల్సింది. ఇనార్బిట్ మాల్ కి దగ్గరలో దుర్గం చెరువుపై నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జిని సెప్టెంబర్ 19వ తేదీన ప్రారంభిస్తున్నామని జీహెచ్ ఎమ్ సీ అధికారులు కొన్ని రోజుల క్రితమే వెల్లడి చేసారు. కానీ ఈరోజు ప్రారంభోత్సవం జరగలేదు. ఈ విషయమై జీహెచ్ ఎమ్ సీ అధికారులు స్పందిస్తూ, కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నామని తెలిపారు.
అయితే ప్రారంభోత్సవం జరగబోయేది ఏ రోజున అనేది మాత్రం చెప్పలేదు. ఈ విషయమై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. ఈ టైమ్ లో కేబుల్ బ్రిడ్జి ప్రారంభం సరైనది కానందున వాయిదా వేసుంటారని హైదరాబాద్ వాసులు అనుకుంటున్నారు. వాతావరణ సమాచారం ప్రకారం మరో రెండు రోజుల తర్వాత వర్షాలు తగ్గిపోతాయి. సో.. ఆ తర్వాత ప్రారంభోత్సవ వేడుక ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి ఈ బ్రిడ్జి మీదుగా చాలా మంది ప్రయాణిస్తున్నారు.