హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. నగరవాసులను ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించడానికి మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెట్రో అందుబాటులోకి వచ్చాక ట్రాఫిక్ కష్టాలు కాస్త తీరినట్టే అనిపించాయి. దాదాపు ఎక్కువ మంది మెట్రోలో వెళ్లడానికే మొగ్గుచూపుతున్నారు. దీంతో నగరంలో మెట్రో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
అయితే తరచూ సాంకేతిక సమస్యలతో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ఉదయాన్నే ఆఫీసులు, కళాశాలలకు వెళ్దామని ఆదరబాదరాగా బయల్దేరుతోన్న నగరవాసులు సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోంది. తాజాగా హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపంతో ఎర్రమంజిల్‌లో మెట్రో రైలు నిలిచిపోయింది.
మెట్రో నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులను.. సిబ్బంది మరో రైలులోకి తరలించారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్తుండగా.. సాంకేతిక సమస్య తలెత్తినట్టు అధికారులు గుర్తించారు. ఆఫీసులకు, వివిధ పనులకు వెళ్లే సమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దీంతో మియాపూర్- ఎల్బీనగర్ మార్గంలో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.