హైదరాబాద్ మెట్రో రైలు రాంగ్ ట్రాక్‌లో ప్రయాణించిందంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదన్నారు.
సోషల్ మీడియా పుణ్యమా అని… మనకు అందులో కనిపించే.. వచ్చే.. వార్తల్లో చాలా వరకు నకిలీ వార్తలే ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలోనైతే నకిలీ వార్తలు అందులో ఎక్కువైపోయాయి. ఇవాళ కూడా ఇలాగే ఓ నకిలీ వార్త హల్‌చల్ చేసింది. హైదరాబాద్ మెట్రో రైలు రాంగ్ ట్రాక్‌లో ప్రయాణించిందంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరూ ఇలాంటి పుకార్లను సృష్టించొద్దని అన్నారు.
ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల తరువాత మెట్రో రైలుకు పెను ప్రమాదం తప్పిందంటూ వార్తలు వచ్చాయి. మియాపూర్ నుంచి ఎల్‌బీ నగర్ వెళ్లాల్సిన మెట్రో రైలు ఆటోమేషన్ తప్పిదం వల్ల రాంగ్ ట్రాక్‌లో వెళ్లిందని, దీంతో అదే ట్రాక్‌పై మరో మెట్రో రైలు ఎదురుగా వచ్చిందని, ఈ క్రమంలో రెండు రైళ్లకు భారీ ప్రమాదం తప్పిందని వార్తలు వచ్చాయి. అయితే పొరపాటును గుర్తించిన సిబ్బంది వెంటనే రైలును లక్డీకాపూల్ స్టేషన్‌లో ఆపారని, దీంతో 400 మంది సురక్షితంగా బయట పడ్డారని, ఆ తరువాత రైలును మియాపూర్ స్టేషన్‌కు తరలించారని.. వార్తలు వ్యాప్తి చెందాయి. అయితే ఈ వార్త పూర్తిగా అవాస్తవమని, అందులో ఎలాంటి నిజం లేదని మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో వీచిన పెను గాలులకు అసెంబ్లీ స్టేషన్ సమీపంలోని ట్రాక్‌పై మెట్రోకు సంబంధించిన మెరుపు అరెస్టెడ్ రాడ్ ఒకటి పడిపోయిందని, అయితే ముందు జాగ్రత్తగా ఎలక్ట్రిక్ పవర్‌ను నిలిపివేసి రాడ్‌ను తొలగించామని తెలిపారు.
Metro woes in Hyderabad today. pic.twitter.com/mKzlymQON5
— Sushil Rao (@sushilrTOI) July 27, 2019
ఇక రైలుకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో దాన్ని బ్యాటరీతో నడిపించామని ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో రైలులో ఉన్న ఓ ప్రయాణికుడు తనకు ఆస్తమా ఉందని చెప్పడంతో వెంటనే ప్రయాణికులకు ట్రాక్‌పై నడిచేందుకు అనుమతినిచ్చామని ఆయన తెలిపారు. అసెంబ్లీ స్టేషన్‌కు కొన్ని మీటర్ల దూరంలోనే రైలును ఖాళీ చేయించి దాన్ని ప్లాట్‌ఫాం మీదకు తీసుకువచ్చామని, భద్రతాపరమైన చర్యల కారణంగానే మెట్రో సేవలకు 30 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడిందని ఆయన వివరణ ఇచ్చారు. ఇక మెట్రో రైళ్ల పరంగా వచ్చే నకిలీ వార్తలను ప్రయాణికులు నమ్మకూడదని ఆయన సూచించారు..!