హైదరాబాద్ లో వింత పరిస్థితి.. ఈ అభ్యర్థులు వారి ఓటు వారికే వేసుకోలేరు

-

లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వింత పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత ముఖ్యమో ఓటు అంతకంటే ముఖ్యం. పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఒక్క ఓటు కూడా చేజారకుండా చూసుకుంటారు. అయితే, హైదరాబాద్ లో మాత్రం ఐదుగురు అభ్యర్థులు తమ ఓటు తమకే వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంతకీ వాళ్లెవరంటే..?

హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓటు పాత బస్తీలో లేదు. అసద్ రాజేంద్ర నగర్ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఇది చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దీంతో ఆయన తన ఓటు తనకే వేసుకోలేకపోతున్నారు.

మరోవైపు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్ర హిల్స్ లో ఉంటున్నారు. ఇది మల్కాజిగిరి నియోజకవర్గం కిందకు వస్తుంది. అంటే ఈమె కూడా తన ఓటు తనకు వేసుకోలేరు. హైదరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్ కు ఓటు జూబ్లీహిల్స్ లో ఉంది. ఇది సికింద్రాబాద్ లోక్ సభ స్థానం పరిధికి వస్తుంది. దీంతో సమీర్ తన ఓటును తనకు వేసుకోలేరు.

మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఓటు తాండూరు అసెంబ్లీ పరిధిలో ఉంది. ఇది చేవెళ్ల లోక్ సభ నియోజకర్గం కిందకు వస్తుంది. చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు ఓటు మల్కాజిగిరి లోక్ సభ స్థానంలో ఉంది. ఇది కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది. ఇలా ఈ అభ్యర్థులంతా వారి ఓటు వారికే వేసుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news