మహారాష్ట్రలోని పుణెలో.. మద్యం మత్తులో కారు నడుపుతూ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల మృతికి కారణమైన మైనర్ బాలుడి (17) బెయిల్‌ను జువైనల్ జస్టిస్ బోర్డు రద్దు చేసింది. వచ్చే నెల 5వ తేదీ వరకు అబ్జర్వేషన్ హోంలో ఉంచాలని ఆదేశించడంతో పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు. మైనర్ తండ్రి విశాల్ అగర్వాల్కు సెషన్స్ కోర్టు రెండు రోజుల కస్టడీ విధించింది.
గత ఆదివారం మద్యం మత్తులో కారుతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కేసులో గంటల్లోనే బాలుడికి బెయిల్ మంజూరు కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డు వద్దకు వెళ్లి, ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరుతూ.. ఈ ప్రమాదాన్ని అతి క్రూరమైన చర్యగా అభివర్ణించారు. పోలీసుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, బెయిల్‌ను రద్దు చేస్తూ ఆదేశాలను సవరించింది. మైనర్ను మేజర్గా పరిగణించి విచారించడానికి రిమాండ్ హోమ్కు పంపాలని జువైనల్ జస్టిస్ బోర్డులో రివ్యూ అప్లికేషన్ దాఖలు చేశామని వెల్లడించారు. తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న బోర్డు 15 రోజుల పాటు రిమాండ్ హోమ్ తరలించిందని, కానీ, మేజర్గా విచారించేందుకు ఇంకా ఉత్తర్వులు రాలేదని పేర్కొన్నారు.