మెట్రో నగరం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉదయం ఆఫీస్‌కు వెళ్లే నగరవాసులు 7 గంటలకు స్టార్ట్ అయితే కాని 10 గంటలకు చేరుకోలేని పరిస్థితి. ఏకంగా ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోతున్నారు. సాయంత్రం కూడా అదే పరిస్థితి. 5 గంటలకు ఆఫీస్ కంప్లీట్ అయితే ఇంటికి వచ్చేటప్పటకీ 8… ఒక్కోసారి 9 కూడా అవుతోన్న పరిస్థితి. ట్రాఫిక్‌లో ఆఫీస్‌లకు వెళ్లిరావడం ఇక్కడ పెద్ద నరకంగా మారింది. నగరంలో ట్రాఫిక్ కష్టాలు రోజు రోజుకు బాగా పెరుగుతున్నాయి. వీటి కోసం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఆగడం లేదు. ఇక ఐటీ ఉద్యోగులు పడుతోన్న బాధలు అన్నీ ఇన్నీ కావు. ఐటీ కారిడార్లలోనే ఈ ట్రాఫిక్ కష్టాలు ఎక్కువుగా ఉన్నాయి.
అయితే ఈ ఐటీ కారిడార్లలో రహేజా పార్కు – రాయదుర్గం, బయోడైవర్సిటీ పార్కు – ఐకియా మార్గంలో కార్ల రద్దీ ఎక్కువగా ఉంది. రాయదుర్గం పరిధిలో కొత్త ఐటీ సంస్థలు పుట్టుకు రావడంతో ఇక్కడ కూడా ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగి కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఇక్కడ ట్రాఫిక్ రద్దీ కూడా ఎక్కువ అవుతోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో భవిష్యత్తులో అయినా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు తెలంగాణ సర్కార్ సరికొత్త ప్లాన్‌తో ముందుకు వెళుతోంది.
గతంలో ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేసిన ‘సరి-బేసి’ విధానం అమలు చేయాలని చూస్తోంది. ఈ అంశంపై ఐటీ సంస్థల ప్రతినిధులతో పాటు జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ, టీఎస్‌ఐఐసీ, పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. కార్ ఫూలింగ్ ఎంకరేజ్ చేయడంతో పాటు అదే టైంలో ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచే అంశంపై ఆలోచన చేస్తున్నారు. ఇక మెట్రో ప్రయాణాన్ని మరింతగా ప్రోత్సహించనున్నారు.
ఇక మాదాపూర్, హైటెక్ సిటీ రూట్లలో ఆర్టీసీ సర్వీసులను మరింతగా పెంచనున్నారు. ఇక ఢిల్లీలో పార్కింగ్ లాట్ ఫీజు ఏకంగా రూ.5 వేలు ఉంది. దీంతో అక్కడ కార్ల రద్దీ కొంత వరకు తగ్గింది. అయితే హైదరాబాద్‌లో సరి-బేసి సిస్టమ్ అమలు చేస్తే ఇక్కడ ప్రజలు, ఉద్యోగుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే మెట్రోకు కూడా ఐటీ కారిడార్ ఉండడంతో ట్రాఫిక్‌కు కొంత వరకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. మరి ఈ ప్రయత్నాలు హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు ఎంత వరకు తీరుస్తాయో ? చూడాలి.