హైదరాబాద్ పోలీసులు రికార్డ్ సృష్టించారు. ఒక గుండె తరలింపు కోసం అంత పెద్ద హైదరాబాద్ లో ఎలాంటి అంతరాయం లేకుండా గుండెను తరలించారు. ట్రాఫిక్ ని దాటుకుని వ్యూహాత్మకంగా తీసుకువెళ్ళారు. రాంపల్లి నాగారంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 20 ఏళ్ళ విశాల్ ప్రమాదవ శాత్తు కింద పడటంతో తలకు బలంగా గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తీసుకుని వెళ్ళగా అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది.
బుధవారం తుదిశ్వాస విడవడంతో వెంటనే అతని తల్లి తండ్రులతో మాట్లాడి అవయవదానానికి అంగీకరించారు. జీవన్‌దాన్ నిర్వాహకులు యశోదా ఆస్పత్రికి వచ్చి విశాల్ అవయవాలను దానం చేయడానికి ఒప్పించడంతో విశాల్ గుండెను సేకరించి ప్రత్యేక బాక్స్ లో అంబులెన్స్ తో తీసుకుని వెళ్లి, ఒక వ్యక్తి గుండెను మార్పిడి చేసారు. ఇందుకోసం పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి నుంచి గుండెను అంబులెన్స్‌లో తీసుకుని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించాలి. ఈ రెండు ఆస్పత్రుల మధ్య దూరం 13 కిలోమీటర్లు ఉండగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కేవలం 11 నిమిషాల వ్యవధిలో గుండెను తరలించారు. ట్రాఫిక్ పోలీసులు అందరూ సహకరించడంతో ఎలాంటి ఆటంకం లేకుండా తీసుకువెళ్ళారు. యశోదా ఆస్పత్రి నుంచి రాత్రి 8.50 గంటలకు బయలు దేరిన అంబులెన్స్ రాత్రి 9.01 గంటలకు అపోలోకి వచ్చింది.