ఐపీఎల్ 2020 3వ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు నేడు పోటీ పడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. కాగా ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి. ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్లు ఉన్నాయి. దీంతో రెండు టీంల మధ్య హోరాహోరీ పోరు తప్పదని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్, బెంగళూరు జట్లు ఐపీఎల్‌లో 15 మ్యాచ్‌లు ఆడాయి. వాటిల్లో హైదరాబాద్ 8 సార్లు గెలుపొందగా, బెంగళూరు 6 సార్లు విజయం సాధించింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే బెంగళూరుపై హైదరాబాద్ జట్టుదే కొంచెం పైచేయిగా మనకు కనిపిస్తుంది. కానీ బెంగళూరు జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ టీం కూడా ప్రస్తుతం చాలా బలంగా ఉంది. అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్న ప్లేయర్లు బెంగళూరులోనూ ఉన్నారు.
బెంగళూరు జట్టులో కెప్టెన్ కోహ్లితోపాటు ఫించ్, గురుకీరత్ సింగ్, మొయిన్ అలీ, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, ఏబీ డివిలియర్స్, యజువేంద్ర చాహల్, డేల్ స్టెయిన్, ఉమేష్ యాదవ్, ఆడం జంపా వంటి అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. అందువల్ల బెంగళూరు జట్టు చాలా పటిష్టంగా ఉందని చెప్పవచ్చు. ఇక హైదరాబాద్ జట్టులో కెప్టెన్ వార్నర్‌తోపాటు కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, మిచెల్ మార్ష్, విజయ్ శంకర్, ఫేబియన్ అలెన్, మహమ్మద్ నబీ, జానీ బెయిర్‌స్టో, భువనేశ్వర్ కుమార్, బేసిల్ థంపి, బిల్లీ స్టాన్‌లేక్, రషీద్ ఖాన్ వంటి టాప్ మోస్ట్ ప్లేయర్లు ఉన్నారు. అందువల్ల హైదరాబాద్ టీం కూడా బలంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రెండింటిలో ఏ జట్టును విజయం వరిస్తుందో చూడాలి.