దుబాయ్‌లో శుక్రవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 14వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇన్నింగ్స్ ఆరంభంలో చెన్నై తడబడినా చివర్లో ధోనీ మెరుపులు మెరిపించాడు. అయినప్పటికీ సాధించాల్సిన పరుగులు ఎక్కువగానే ఉండడంతో హైదరాబాద్ గెలుపొందింది. చివర్లో ధోనీ ఆటకు హైదరాబాద్ కొంత ఆందోళన పడింది. కానీ చెన్నై లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. దీంతో హైదరాబాద్‌ను విజయం వరించింది.
కాగా మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లలో పీకే గార్గ్ (51 పరుగులు నాటౌట్, 6 ఫోర్లు, 1 సిక్సర్), అభిషేక్ శర్మ (31 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్), మనీష్ పాండే (29 పరుగులు, 5 ఫోర్లు)లు రాణించారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్, పీయూష్ చావ్లాలు చెరొక వికెట్ తీశారు. మరొక వికెట్ రనౌట్ రూపంలో లభించింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో జడేజా (50 పరుగులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎంఎస్ ధోనీ (47 పరుగులు నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, అబ్దుల్ సమద్‌లకు చెరొక వికెట్ దక్కింది. మరొక వికెట్ రనౌట్ రూపంలో లభించింది.