అత్యంత సంచలనం సృష్టించిన కాన్పూర్ కాల్పుల ఘటన కేసులో 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే శుక్రవారం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం విదితమే. అయితే ఈ విషయంపై.. కాన్పూర్ కాల్పుల్లో చనిపోయిన పోలీసు అధికారి జితేంద్ర పాల్ సింగ్ తండ్రి తిరథ్ పాల్ స్పందించారు. వికాస్ దూబే చనిపోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై గర్వంగా ఫీలవుతున్నానని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ పోలీసుల పట్ల తాను ఎంతో గర్వంగా ఫీలవుతున్నానని తిరథ్ పాల్ తెలిపారు. వారు ఈ రోజు చేసిన పని వల్ల తన మనసు కుదుట పడిందని అన్నారు. ఇందుకు సీఎం యోగి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
కాగా.. కాన్పూర్ కాల్పుల ఘటన అనంతరం తప్పించుకున్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే మధ్యప్రదేశ్‌లో అక్కడి పోలీసులకు చిక్కాడు. అక్కడి ఉజ్జయిని మహంకాళి ఆలయం బయట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని యూపీ పోలీసులకు అప్పగించారు. దీంతో యూపీ పోలీసులు అతన్ని కాన్పూర్‌కు తరలించారు. మార్గమధ్యలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసుల వాహనం ఒకటి బోల్తా పడడంతో ఆ సంఘటనను అనువుగా చేసుకున్న వికాస్ దూబే పోలీసుల ఆయుధాలను లాక్కుని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులకు, వికాస్‌దూబేకు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో వికాస్ దూబే అక్కడికక్కడే చనిపోయాడు. ఇందులో పలువురు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి.