ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుపుతున్న సాక్షి ఛానెల్ వివాదంలోకి వెళ్లింంది.లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో సంబంధిత వివాదం నెలకొంది. సెక్యూరిటీ క్లియరెన్స్ ను కేంద్ర హోం శాఖ ఇవ్వకపోవడంతో ప్రయివేటు ఛానెళ్ల జాబితా నుంచి తొలగించారు సంబంధిత అధికారులు.దీంతో ఈ వివాదంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నెలకొంది.అయితే ఇది కేవలం మోడీ ప్రభుత్వం జగన్ కు ఇచ్చిన వార్నింగ్ అనుకునేందుకు వీల్లేదని ఇంకొందరు అంటున్నారు.
మరికొందరు హోం శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ అన్నది అంతర్గత వ్యవహారం అని ఇప్పటికప్పుడు ఇది తేలేదే కాదని అంటున్నారు. 2006 నుంచి 2016 వరకూ పదేళ్ల కాలానికి నియమ నిబంధనల అనుసారం లైసెన్స్ తీసుకున్నారు అని, అక్కడి నుంచి మరో పదేళ్లకు సంబంధించి లైసెన్స్ కోసం అర్జీ పెట్టినా ఇంకా అది అమల్లోకి రాలేదు.దీంతో మోడీకి జగన్ కు మధ్య దూరం పెరిగిన కారణంగానే లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంకానీ లేదా సెక్యూరిటీ జోన్ నుంచి పేరు తొలగించడం కానీ చేసి ఉండవచ్చన్న వాదన ఒకటి వినిపిస్తోంది.
అయితే కేంద్రం చర్యను సవాలు చేస్తూ ఛానెల్ ఉద్యోగులు తెలంగాణ హై కోర్టును ఆశ్రయించగా, కోర్టు వీరికి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ, సంబంధిత కేసు విచారణను వాయిదా వేసింది.మరోవైపు అక్రమాస్తుల కేసులు నడుస్తున్నందునే ఛానెల్ కు హోం శాఖ సెక్యురిటీ క్లియరెన్స్ ఇవ్వలేదని కూడా ప్రముఖ మాధ్యమాలు వెల్లడిస్తున్నాయి.వీటిలో నిజం ఎంతన్నది జగన్ మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా నడుస్తున్న కేసులకు సంబంధించి ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చి కొత్తగా సాధించేదేమీ లేదని కూడా వైసీపీ వర్గాలు అంటున్నాయి. కనుక టీడీపీ మీడియాకు ఈ వార్త పండగ కావొచ్చు కానీ తమకు మాత్రం త్వరలోనే అన్ని అనుమతుల పునరుద్ధరణకూ కేంద్రం సుముఖంగా ఉంటుందన్న ఆశ ఉందనే అంటున్నాయి.