ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. ఈ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌పై జూన్ 10 తరువాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఐసీసీ బోర్డు గురువారం సమావేశమైంది. భవిష్యత్ ప్రణాళికతోపాటు టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై కూడా జూన్ 10 తరువాతే తమ నిర్ణయం ఉంటుందని.. ఐసీసీ వెల్లడించింది.
కాగా అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో ఆ టోర్నీని వాయిదా వేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా ఈ సారి వాయిదా పడింది. ఈ క్రమంలో ఐపీఎల్ కోసం టీ20 వరల్డ్ కప్‌నే వాయిదా వేస్తున్నారని పలువురు ఆరోసిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఐసీసీ గురువారం సమావేశం అయినప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. దీంతో జూన్ 10 అనంతరం టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై స్పష్టత ఇస్తామని ఐసీసీ తెలియజేసింది.
ఇక భారత్‌లో స్టేడియాలలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించుకోవచ్చని ఇటీవల కేంద్రం ఆంక్షలను సడలించింది. అయినప్పటికీ ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ నిర్ణయం తీసుకోలేదు. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించడం కన్నా.. అక్టోబర్ నెలలో కరోనా ప్రభావం తగ్గాక ప్రేక్షకులతో మ్యాచ్‌లు నిర్వహిస్తేనే బాగుంటుందని.. బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఆ సమయంలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తారని ప్రచారం సాగుతోంది. ఇక ఈ విషయంలో స్పష్టత రావాలంటే జూన్ 10వ తేదీ వరకు వేచి చూడక తప్పదు.