కరోనా మహమ్మారి ఎంతో మందిని తీవ్రంగా నష్టాలకు గురి చేసింది. ఎంతో మంది ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. ఎన్నో రంగాలు భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. అనేక పరిశ్రమలు మూత పడ్డాయి. కొన్ని పరిశ్రమలు, కంపెనీలకైతే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో వాటిని నడపాలా, వద్దా.. అని యాజమాన్యాలు సందేహిస్తున్నాయి. అయితే ఇన్ని ప్రతికూలతలు ఉన్నా.. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం తన ఉద్యోగులకు జీతాలను పెంచింది.
దేశంలో ప్రైవేటు రంగంలో రెండో అతి పెద్ద బ్యాంకుగా ఉన్న ఐసీఐసీఐ తన ఉద్యోగులకు జీతాలను పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీతో ప్రారంభం కాగా.. జూలై నుంచి ఆ బ్యాంకు ఉద్యోగులు పెరిగిన జీతాన్ని అందుకుంటున్నారు. మొత్తం 8 శాతం జీతాన్ని పెంచినట్లు ఐసీఐసీఐ తెలిపింది. కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులకు జీతాలను పెంచడంపై ఇతర బ్యాంకింగ్ సంస్థలు ఆశ్చర్యపోతున్నాయి.
అయితే కరోనా సంక్షోభంలో కూడా తమ ఉద్యోగులు సేవలు అందించారని, వారి సేవలను గుర్తిస్తూ జీతాలను పెంచామని ఐసీఐసీఐ తెలిపింది. కరోనా కష్టకాలంలో ఐసీఐసీఐ ఇలా జీతాలను పెంచడం పట్ల దేశీయ బ్యాంకింగ్ సంస్థలు షాక్కు గురవుతున్నాయి.