ఐసీఐసీఐ బంప‌ర్ ఆఫ‌ర్‌.. శాల‌రీ అకౌంట్ ఉన్న వారికి ”ఇన్‌స్టా ఫ్లెక్సి క్యాష్‌”

-

ఐసీఐసీఐ బ్యాంకులో మీకు శాల‌రీ అకౌంట్ ఉందా ? అయితే మీకు ఆ బ్యాంక్ బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. ”ఇన్‌స్టా ఫ్లెక్సి క్యాష్” పేరిట ఆ బ్యాంకు కొత్త‌గా ఓడీ (ఓవ‌ర్ డ్రాఫ్ట్‌) స‌దుపాయాన్ని క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తోంది. దీని ద్వారా ఖాతాదారులు ఓవ‌ర్ డ్రాఫ్ట్ స‌దుపాయం పొంద‌వ‌చ్చు. ఈ ఆఫ‌ర్ పొందేందుకు క‌స్ట‌మ‌ర్లు ఎలాంటి ఫాంలు నింపాల్సిన పనిలేదు. బ్యాంకుకు వెళ్లాల్సిన ప‌నిలేదు. అంతా ఆన్‌లైన్‌లోనే పూర్తిగా పేప‌ర్‌లెస్ ప‌ద్ధ‌తిలో ఈ సౌక‌ర్యం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుని ఆ మేర‌కు ఓడీ స‌దుపాయం పొంద‌వ‌చ్చు.

icici bank launched insta flexi cash over draft facility

ఐసీఐసీఐ బ్యాంకు శాల‌రీ అకౌంట్ హోల్డ‌ర్లు ఇన్‌స్టా ఫ్లెక్సి క్యాష్ ద్వారా లైన్ ఆఫ్ క్రెడిట్ లేదా ఓవ‌ర్ డ్రాఫ్ట్ స‌దుపాయం పొంద‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో క‌స్ట‌మ‌ర్ల‌కు వ‌చ్చే ఓడీ లిమిట్‌లో కేవ‌లం ఉప‌యోగించుకున్న మొత్తానికే వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. ఉదాహ‌ర‌ణ‌కు ఒక క‌స్ట‌మ‌ర్‌కు రూ.4 ల‌క్ష‌ల ఓడీ లిమిట్ వ‌చ్చింద‌నుకుంటే.. అందులోంచి అతను రూ.60వేలు ఉప‌యోగించుకున్నాడ‌నుకుంటే.. ఆ రూ.60వేల‌కే వ‌డ్డీ చెల్లించాలి. స‌ద‌రు రూ.4 ల‌క్షల లిమిట్‌కు వ‌డ్డీ చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌న్న‌మాట‌.

ఇక ఈ సౌక‌ర్యం ద్వారా క‌స్ట‌మ‌ర్లు డ‌బ్బు పొంది త‌మ‌కు ఉండే ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం అనేక మంది ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న దృష్ట్యా త‌మ బ్యాంకులో శాల‌రీ అకౌంట్లు క‌లిగిన వారి కోసం ఈ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చామ‌ని ఐసీఐసీఐ వెల్ల‌డించింది. ఆ మొత్తంతో వారు నెల నెలా ఈఎంఐలు చెల్లించుకోవ‌చ్చ‌ని, ఇత‌ర ఏవైనా ఖ‌ర్చులు ఉంటే ఆ డ‌బ్బు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని బ్యాంకు తెలిపింది.

ఐసీఐసీఐ బ్యాంకు శాల‌రీ అకౌంట్ హోల్డ‌ర్లు ఆ బ్యాంకు యాప్ లేదా సైట్‌లోకి లాగిన్ అయ్యి అందులో ఉండే ప్రీ అప్రూవ్డ్ ఆఫ‌ర్ల సెక్షన్‌లోకి వెళ్లాలి. అక్క‌డే ఈ ఆఫ‌ర్ క‌నిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి వివ‌రాల‌ను న‌మోదు చేయాలి. దీంతో 24 నుంచి 48 గంట‌ల్లోగా ఈ ఆఫ‌ర్‌కు ఎలిజిబుల్ అయితే వెంట‌నే క్రెడిట్ లిమిట్ వ‌స్తుంది. ఈ క్ర‌మంలో బ్యాంకుకు వెళ్ల‌కుండానే పూర్తిగా డిజిటల్ ప‌ద్ధ‌తిలో వారు ఈ ఆఫ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

ఐసీఐసీఐ అందిస్తున్న ఇన్‌స్టా ఫ్లెక్సి క్యాష్ ఫీచ‌ర్లు ఇవే…
* ఐసీఐసీఐ బ్యాంకు శాల‌రీ అకౌంట్ హోల్డ‌ర్లు త‌మ శాల‌రీకి 3 రెట్ల విలువైన క్రెడిట్ లిమిట్‌ను ఈ ఫీచ‌ర్ ద్వారా పొంద‌వ‌చ్చు. అంటే.. ఉదాహ‌ర‌ణ‌కు.. ఒక ఉద్యోగి ఖాతాలో జ‌మ అయ్యే శాల‌రీ రూ.20వేలు అనుకుంటే.. దానికి 3 రెట్లు.. అంటే.. రూ.60వేల వ‌ర‌కు ఈ ఫీచ‌ర్ ద్వారా క్రెడిట్ లిమిట్ ల‌భిస్తుంది.
* మొత్తం ఓడీ లిమిట్ కాకుండా అందులో వాడుకున్న మొత్తానికే వ‌డ్డీ చెల్లించ‌వ‌చ్చు.
* క‌స్ట‌మ‌ర్లు తీసుకున్న మొత్తాన్ని ఎలా అయినా, ఎప్ప‌టి వ‌ర‌కు అయినా చెల్లించ‌వ‌చ్చు. కాక‌పోతే ఆ మొత్తానికి నెల నెలా అయ్యే వ‌డ్డీని మాత్రం నెల నెలా చెల్లించాలి. అస‌లును ఎప్పుడు అయినా క్లియ‌ర్ చేయ‌వ‌చ్చు.
* తీసుకున్న మొత్తానికి ఎలాంటి ఫోర్ క్లోజ‌ర్ చార్జిల‌ను వ‌సూలు చేయ‌డం లేదు.
* రుణం మొత్తాన్ని 12 నెల‌ల‌కు ఒక‌సారి ఆటో రెన్యువ‌ల్ చేసుకోవ‌చ్చు.
* క‌స్ట‌మ‌ర్లు ఎప్పుడంటే అప్పుడు ఆ లిమిట్ నుంచి మొత్తాన్ని త‌మ శాల‌రీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు.

ఫీజు, చార్జిలు
* ప్రాసెసింగ్ ఫీజు రూ.1,999 + జీఎస్‌టీ
* రెన్యువ‌ల్ ఫీజు రూ.1,999 + జీఎస్‌టీ
* వ‌డ్డీ ఏడాదికి 12 నుంచి 14 శాతం మ‌ధ్య ఉంటుంది

ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఉన్న ప్ర‌కారం.. క‌స్ట‌మ‌ర్‌కు ఫ్లెక్సిక్యాష్ లిమిట్ రూ.1 ల‌క్ష వ‌చ్చింద‌నుకుంటే.. దానికి ఏడాదికి 12.20 శాతం వ‌డ్డీ విధించార‌నుకుంటే.. క‌స్ట‌మ‌ర్ అందులోంచి రూ.10వేలు వాడుకుని ఆ మొత్తాన్ని 15 రోజుల త‌రువాత చెల్లిస్తే.. అప్పుడు వ‌డ్డీ రూ.50.14 ప‌డుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news