ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మెల్లమెల్లగా చంద్రబాబునాయుడు లాగా మారిపోతున్నట్లు వార్తలు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్నాయి. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పక్షంపై ఏదో ఒక వంకతో విమర్శలు చేస్తూనే ఉంటాయి. దానివల్ల అధికారంలో ఉన్న పార్టీ ఇంకా బాగా పనిచేస్తుందని ప్రతిపక్షం యొక్క ఉద్దేశం. అయితే ఇలాంటి సూత్రాలు మన నేతలు ఎప్పుడో మర్చిపోయారు అనుకోండి. కాకపోతే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏ విధంగా వ్యవహరించారో అదే రీతిలో వ్యవహరిస్తున్నారు.
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ని ఉద్దేశించి వాడు వీడు అంటూ సంబోధించే వాళ్ళు. ఇప్పుడు అదే స్థాయిలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారు. విషయంలోకి వెళితే ఇటీవల వైయస్ జగన్ విజయనగరం జిల్లాలో జగనన్న విద్య దీవెన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగన్ విపక్షాల్ని ఉద్దేశించి ‘రాక్షసులు..’ అన్నారు. అక్కడితో ఆగలేదు, విపక్షాల్ని ఉద్దేశించి ‘ఉన్మాదులు’ అనేశారు.
దీంతో జగన్ చేసిన కామెంట్ల పట్ల విమర్శలు వస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పైగా భారీ మెజార్టీ సాధించి ప్రజల మద్దతు పుష్కలంగా అందుకుని ఈ విధంగా జగన్ వ్యవహరించడం మంచిది కాదని సీనియర్ రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఫుల్ మెజారిటీ ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే జగన్ మరొక చంద్రబాబు అవడం గ్యారెంటీ అని, ప్రతిపక్షాలకు బాధ్యతాయుతమైన కౌంటర్లు ఇవ్వాలని వ్యాఖ్యానిస్తున్నారు.