ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ ఎస్ బీ ఫాంపై గెలిచిన తనను రాజీనామా చేయాలని కోరితే తప్పకుండా రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. రెండు రోజులుగా జరుగుతున్ పరిణామాలపై ఈ రోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై సీఎం కేసీఆర్ అన్ని రకాల శక్తులను ఉపయోగించారని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కేసీఆర్ తనను వేధిస్తున్నారని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. ఉద్యమ నాయకుడు తనపై కుట్ర చేశారని ఆరోపించారు. తాను ప్రేమతో చెబితే వినేవాడినని, బెదిరింపులకు లొంగిపోనని స్పష్టం చేశారు.
మనుషులుగా కూడా చూడలేదు
తమను మంత్రులుగా చూడకపోయినా.. కనీసం మనిషిగా చూస్తే బాగుండు అని భావించానని ఈటల రాజేందర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఆత్మగౌరవం ఎక్కువ అని, అందుకే గౌరవం కావాలని కోరానని చెప్పారు. అంతే గానీ ఇతరుల్లాగా గౌరవం ఇవ్వకున్నా భరించే వ్యక్తిని కాదని తెలిపారు. ఈ రోజు ముఖ్యమంత్రి తనపై ఇన్ని రకాల ఇబ్బందులు పెడతారని ఊహించలేదని చెప్పారు.
చావనైనా చస్తా.. లొంగిపోను
తాను చావనైనా చస్తానని, అంతేగాని బెదిరింపులకు లొంగనని స్పష్టం చేశారు. ఇక టీఆర్ ఎస్ లో ఎవరు కూడా సంతోషంగా లేరని, ఎవరికీ గౌరవం లేదని తేల్చి చెప్పారు. సీఎం తలచుకుంటే ఏదైనా చేయగలరని తెలుసని, అయితే తన ఆస్తులను తీసుకున్నా.. తనను మాత్రం ఏం చేయలేరని విరించారు.
కలెక్టర్ చెప్పింది అబద్దం
ఇక మెదక్ కలెక్టర్ ఇచ్చిన రిపోర్టు పచ్చి అబద్ధం అని ఈటల మండిపడ్డారు. వావివరసలు కూడా తెలియకుండా కొడుకును తల్లికి భర్తగా చూపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఇచ్చిన రిపోర్టుపై తనకు అనుమానాలు ఉన్నాయని, వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలను డిమాండ్ చేశారు. తనకు సంబంధం లేని భూముల్లో తనను ఇరికించారని ఆరోపించారు. భూములను కొలిచినప్పుడు తనకు చెప్పలేదని, ఒక్క చెట్టు కూడా తాను కొట్టించలేదన్నారు.
కోర్టుకు వెళ్తా..
తనపై వచ్చిన ఆరోపణలపై, కలెక్టర్ ఇచ్చిన రిపోర్టుపై తాను కోర్టుకు వెళ్తానని, కోర్టు తప్పు చేసినట్టు రుజువు చేస్తే.. తాను ఏ శిక్షకు అయినా సిద్ధమే అని స్పష్టం చేశారు. సర్పంచ్ ను భయపెట్టి తప్పుగా చెప్పించారని సంచలన ఆరోపణలు చేశారు.
సీఎం చెప్పినట్టు కలెక్టర్ రాశారు
కలెక్టర్ పూర్తిగా తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. సీఎం చెప్పినట్టు కలెక్టర్ నివేదిక తయారు చేశారని, తనకు తెలియకుండా బలవంతంగా భూములు కొలిచారని మండిపడ్డారు. కేసీఆర్ కు ఎదురు లేదని అందుకే తనను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే మంచిది కాదన్నారు.
సీఎం ఫామ్ హౌస్ కు అసైన్డ్ భూములను వాడారు
సీఎం కేసీర్ ఫామ్ హౌస్ కు కూడా అసైన్డ్ భూములను వాడారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే దానిపై తాను మాట్లాడనని, కానీ తనపై మాత్రం ఎందుకు కక్షపూరితంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్ని రోజులు జైల్లో పెడ్తారు?
తనపై కుట్ర చేసి ఎన్ని రోజులు జైల్లో పెడతారని ప్రశ్నించారు. డైరెక్ట్ గా కేసీఆర్ కు కొన్ని ప్రశ్నలు సంధించారు. తాను ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. తన ఆస్తులు గుంజుకున్నా.. తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక ఎలాంటి వ్యాపారం చేయలేదని చెప్పారు.