నిత్యం గ్రీన్ టీ తాగడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. గ్రీన్ టీ వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. బరువు తగ్గుతారు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అయితే గ్రీన్ టీ దాదాపుగా అందరికీ మేలు చేసినా పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం గ్రీన్ టీని తాగకూడదు. మరి ఏయే సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
* పెప్టిక్ అల్సర్, గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీని తాగరాదు. తాగితే ఆయా సమస్యలు మరింత ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది.
* ఐరన్ లోపం, రక్తహీనత ఉన్నవారు గ్రీన్ టీని తాగకూడదు. ఎందుకంటే మన శరీరం ఐరన్‌ను శోషించుకోకుండా గ్రీన్ టీ అడ్డు పడుతుంది. కనుక ఆ సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీని తాగకపోవడమే మంచిది.
* గ్రీన్ టీలో ఎక్కువగా ఉండే కెఫీన్ మైగ్రేన్ సమస్యలు ఉన్నవారికి మంచిది కాదు. అందుకని మైగ్రేన్ ఉన్నవారు కూడా ఈ టీకి దూరంగా ఉండాలి.
* నిద్రలేమి, ఆందోళన, కంగారు ఉన్నవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి. లేదంటే ఆయా సమస్యలు మరింత ఎక్కువవుతాయి.
* అసాధారణ రీతిలో గుండె కొట్టుకునే గుండె జబ్బులు ఉన్నవారు, డయేరియా, వాంతులతో బాధపడేవారు కూడా గ్రీన్ టీ తాగరాదు.
* హైబీపీ, గ్లకోమా, కీళ్లనొప్పులు, లివర్ వ్యాధులు ఉన్నవారు, గర్భిణీలు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి.
* చిన్న పిల్లలకు ఎట్టి పరిస్థితిలోనూ గ్రీన్ టీ తాగించకూడదు. ఎందుకంటే వారు తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం శోషించుకోకుండా గ్రీన్ టీ అడ్డుపడుతుంది. దీంతో వారిలో పోషకాహార లోపం తలెత్తే అవకాశం ఉంటుంది. కనుక చిన్న పిల్లలకు గ్రీన్ టీ ఇవ్వకూడదు.