క్యాంపస్ ఇంటర్వ్యూల్లో హైదరాబాద్ ఐఐఐటీ ధమాకా

-

క్యాంపస్ ఇంటర్వ్యూ వార్షిక సగటు వేతనంలో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ట్రిపుల్‌ ఐటీ) దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ బీటెక్‌ నాలుగేళ్ల కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు సగటున రూ.29.53 లక్షల వార్షిక వేతనంతో కొలువులకు ఎంపికయ్యారు. ఆ తర్వాత ఐఐటీ కాన్పుర్‌ రూ.19.15 లక్షల సగటు ప్యాకేజీతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల కళాశాలలకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేంవర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకులు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులోభాగంగా 2018-19, 2019-20, 2020-21లో ప్రాంగణ నియామకాల సంఖ్య, వార్షిక సగటు వేతనం, ఉన్నత విద్యకు వెళ్లిన వారు తదితర వివరాలనూ తీసుకుంది. ఇంజినీరింగ్‌ విద్యలో 200 ర్యాంకుల వరకు ప్రకటించింది.

ఆయా కళాశాలల్లో ప్రాంగణ ఎంపికల వార్షిక వేతన ప్యాకేజీ వివరాలను ‘ఈనాడు’ పరిశీలించగా.. ట్రిపుల్‌ఐటీ తొలి స్థానంలో నిలిచింది. అక్కడ బీటెక్‌ పూర్తి చేసినవారికి 2018-19లో రూ.20 లక్షలు, 2019-20లో రూ.21 లక్షలు, 2020-21లో రూ.29.53 లక్షలు సగటు వేతనం లభించింది. అత్యధిక వేతనం రూ.56 లక్షలు. ఇక అయిదేళ్ల డ్యూయల్‌ డిగ్రీలో 2020-21లో రూ.24 లక్షలు, రెండేళ్ల పీజీకి రూ.18.70 లక్షల సగటు ప్యాకేజీ లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news