ఇంకా పూర్తి కాని పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలసంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, పీపీఏ సభ్యులు హాజరయ్యారు. పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయమై జలసంఘం లోతుగా చర్చించింది. డయాఫ్రం వాల్ నాలుగు ప్రదేశాల్లో దెబ్బతిన్నట్టు వచ్చిన నివేదికపై చర్చించింది. డయాఫ్రం వాల్ నిర్మాణ లోపాల బాధ్యత రాష్ట్రానిదేనని జలశక్తి శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ డిజైన్లలో లోపాలు ఉంటే మాత్రం జలసంఘమే బాధ్యత వహించాలని కేంద్రం పేర్కొంది.
పోలవరం ప్రాజెక్టుకు ఇక 12 వేల 911.15 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వబోతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ తేల్చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి 2017లో కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన మొత్తానికి అదనంగా ఇంతే ఇస్తామని ఒక నోట్‌లో స్పష్టం చేసింది. అంటే.. ప్రాజెక్టు అంచనా ప్రకారం అవసరమైన మరో 23 వేల 249.11 కోట్ల సంగతి అటెకెక్కినట్లే. పూర్తి నిధులు ఇచ్చేది లేదని కేంద్రం కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నా.. సీఎం జగన్ మాత్రం నోరెత్తడం లేదు. వైసీపీను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి నిధులు తెస్తామని ఢంకా బజాయించి చెప్పిన జగన్ మాటలు నమ్మిన ప్రజలు.. 22 మంది ఎంపీలను గెలిపించారు. అయినా కేంద్రం మెడలు వంచడం సంగతి అటుంచి.. దిల్లీ పెద్దల ముందు ఈయనే మెడలు వంచుకుని బాబ్బాబు అంటూ బతిమాలుకుంటున్నారు.