టాలీవుడ్ దిగ్గజ నటుడు కృష్ణంరాజు కన్నుమూయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే.. కృష్ణంరాజు మృతి నేపథ్యంలో.. ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇది ఇలా ఉండగా… ఆయన మరణానికి గల కారణాలను కృష్ణంరాజుకు చికిత్స అందించిన వైద్యులు వెల్లడించారు. కృష్ణంరాజు గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. గతేడాదే ఆయన కాలుకి శస్త్ర చికిత్స జరిగింది. ఆగస్టు 5న కోవిడ్ తర్వాత వచ్చే సమస్యలతో హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. ఆయన రెండు సార్లు కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి నెల రోజులుగా వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అలాగే కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బ తినడం, డయాబెటిస్, తీవ్రమైన కార్డియాక్ అరెస్టుతోనే కృష్ణంరాజు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.