చైనా, భార‌త్‌.. ఏ దేశంపై ఏది ఎక్కువ‌గా ఆధార‌పడింది ? న‌ష్టం ఎవ‌రికి ?

-

గ‌త 40 సంవ‌త్స‌రాల కాలంలో ఎన్న‌డూ లేని విధంగా చైనాకు, మ‌న‌కు ప్ర‌స్తుతం స‌రిహ‌ద్దు వ‌ద్ద పెద్ద ఎత్తున వివాదం చెల‌రేగుతోంది. పాక్‌తో మ‌న‌కు ఎప్పుడూ ఉండే గొడ‌వ‌లే అయినా.. చైనాతో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఇలా ఇప్పుడు పెద్ద ఎత్తున గొడ‌వ‌లు జ‌రుగుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. దీంతో ఇరు దేశాల మార్కెట్ల‌పై ఆ ప్ర‌భావం తీవ్రంగా ప‌డుతుంద‌ని నిపుణులు అంటున్నారు. ప్ర‌స్తుతానికి ఇరు దేశాలు ప్ర‌త్య‌ర్థి దేశ వ‌స్తువులు, కంపెనీల‌పై నిషేధం విధించ‌లేదు. కానీ ఆ నిషేధం అంటూ అమ‌లులోకి వ‌స్తే.. అప్పుడు రెండు దేశాల్లో ఎవ‌రికి ఎక్కువ‌గా న‌ష్టం ఉంటుంది ? అస‌లు భార‌త్‌, చైనాల‌లో ఏ దేశం దేనిపై ఎక్కువ‌గా ఆధార ప‌డి ఉంది ? వ‌స్తువుల‌ను, కంపెనీల‌ను నిషేధిస్తే.. ఏ దేశం ఎక్కువ‌గా న‌ష్ట‌పోతుంది ? అంటే…

india and china which country mostly depended on which one

మ‌నం చైనాకు ఎగుమ‌తి చేసే వ‌స్తువుల వాటా క‌న్నా మ‌నం అక్క‌డి నుంచి దిగుమ‌తి చేసుకునే వ‌స్తువుల వాటాయే ఎక్కువ‌. మ‌న దిగుమ‌తుల్లో చైనా వాటా 14 శాతంగా ఉంది. మ‌న ఎగుమ‌తుల్లో చైనా వాటా 5.33 శాతంగా ఉంది. అంటే.. మ‌న దేశం నుంచి చైనాకు వెళ్లే వ‌స్తువుల క‌న్నా.. అక్క‌డి నుంచి ఇక్క‌డికి వ‌చ్చే వ‌స్తువుల వాటాయే ఎక్కువ‌. ఈ క్ర‌మంలో నిషేధం అంటూ విధిస్తే.. దెబ్బ ప‌డేది చైనాకే.. దీంతో భార‌త్ నుంచి పెద్ద ఎత్తున వ‌చ్చే ఆదాయాన్ని చైనా కోల్పోతుంది. ఇక చైనాకు చెందిన అనేక కంపెనీలు భార‌త్‌లో అనేక కంపెనీలు, స్టార్ట‌ప్ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టాయి. అక్క‌డి ఆలీబాబా గ్రూప్‌.. పేటీఎం, బిగ్ బాస్కెట్‌, స్నాప్‌డీల్‌, జొమాటో, డైలీ హంట్‌, ర్యాపిడో వంటి కంపెనీల్లో భారీగా పెట్టుబ‌డులు పెట్టింది. ఇక చైనాకు చెందిన టెన్సెంట్ గ్రూప్ మ‌న దేశంలోని బైజూస్‌, డ్రీమ్ 11, ఫ్లిప్‌కార్ట్‌, హైక్‌, ఓలా, ఉడాన్‌, స్విగ్గీ, ప్రాక్టో, ఎంఎక్స్ ప్లేయ‌ర్‌, గానా, ఖాతాబుక్ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టింది. ఇలా చైనాకు చెందిన ప‌లు కంపెనీలు భార‌తీయ కంపెనీలు, స్టార్ట‌ప్‌ల‌లో భారీగా పెట్టుబ‌డులు పెట్టాయి. ఈ క్ర‌మంలో నిషేధం అంటూ అమ‌లులోకి వ‌స్తే.. స‌ద‌రు చైనా కంపెనీల‌కు కోలుకోలేని దెబ్బ ప‌డుతుంది.

మ‌రోవైపు భార‌త్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 74 శాతం స్మార్ట్‌ఫోన్లు చైనా కంపెనీల‌కు చెందిన‌వే అని గ‌ణాంకాలు చెబుతున్నాయి. అక్క‌డి షియోమీ మ‌న దేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 30 శాతం వాటాతో అగ్ర స్థానంలో కొన‌సాగుతోంది. త‌రువాత వివో, రియ‌ల్‌మి, ఒప్పో త‌దిత‌ర సంస్థ‌ల‌కు కూడా ఇక్క‌డి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారీగానే వాటాలు ఉన్నాయి. దీంతో ఈ కంపెనీల‌కు దెబ్బ ప‌డుతుంది. అలాగే టిక్‌టాక్‌, షేరిట్‌, యూసీ బ్రౌజ‌ర్‌, హ‌లో, లైక్‌, బ్యూటీ ప్ల‌స్ త‌దిత‌ర చైనా యాప్‌ల‌ను భార‌త్‌లో వాడేవారే ఎక్కువ‌. ఈ క్ర‌మంలో ఆ యాప్‌ల‌ను నిషేధిస్తే వాటి కంపెనీలు భార‌త్ నుంచి పెద్ద ఎత్తున వ‌చ్చే ఆదాయాన్ని కోల్పోతాయి.

ఇక భార‌త్‌కు చెందిన ప‌లు కంపెనీలు చైనాలోని షాంఘై, బీజింగ్‌, గువాంగ్‌డాంగ్ లాంటి న‌గ‌రాల్లో పెట్టుబ‌డులు పెడుతున్నాయి. నిషేధం విధిస్తే ఈ కంపెనీల‌కు దెబ్బ ప‌డుతుంది. అయిన‌ప్ప‌టికీ చైనాలో కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్న భార‌త కంపెనీల క‌న్నా.. భార‌త్‌లో కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్న చైనా కంపెనీలే ఎక్కువ క‌నుక‌.. న‌ష్టం చైనాకే ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక ఇప్ప‌టికే చైనాకు చెందిన సుమారు 450 విభాగాల్లోని 3వేల‌కు పైగా వ‌స్తువుల‌ను నిషేధించాల‌ని సీఐఏటీ కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేసింది. ఆ వ‌స్తువుల్లో.. ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు, బొమ్మ‌లు, దుస్తులు, పిల్ల‌ల ఆహారం, హ్యాండ్ బ్యాగ్స్‌, మ్యూజిక్ ప‌రిక‌రాలు, కిచెన్ సామ‌గ్రి, ఇంటి సామ‌గ్రి, ఆభ‌ర‌ణాలు, వాచ్‌లు, కంటి అద్దాలు, ఫ‌ర్నిచ‌ర్‌, వైద్య ప‌రిక‌రాలు, క్రీడా సామ‌గ్రి, దీపావ‌ళి బాణ‌సంచా త‌దితరాలు ఉన్నాయి. వీటి వ‌ల్ల భార‌తీయ కంపెనీల‌కు ఆదాయం పోతుంద‌ని, క‌నుక వీటిని నిషేధించాల‌ని సీఐఏటీ కోరింది.

అయితే చైనా వ‌స్తువుల‌ను పూర్తిగా బ్యాన్ చేయ‌లేమ‌ని, కానీ కొన్ని చ‌ర్య‌ల వ‌ల్ల ఆ వ‌స్తువుల రాక‌ను అడ్డుకోవ్చ‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. ఈ క్ర‌మంలోనే కేంద్రం చైనా వ‌స్తువుల‌పై భారీ క‌స్ట‌మ్స్ సుంకం పెంచ‌నున్న‌ట్లు తెలిసింది. దీంతో ఆ వ‌స్తువుల ధ‌ర‌లు భారీగా పెరుగుతాయి. మ‌రోవైపు వాటికి ప్ర‌త్యామ్నాయంగా భార‌త్‌లోని కంపెనీలే ఆయా వ‌స్తువుల‌ను ఎక్కువ‌గా త‌యారు చేసేలా కంపెనీల‌కు కేంద్రం ప్రోత్సాహ‌కాలు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిసింది. దీంతో చైనా నుంచి వ‌చ్చే ఆ వ‌స్తువుల వాడ‌కం గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంది. దేశీయ వ‌స్తువుల వాడ‌కం పెరుగుతుంది. చైనా వస్తువుల‌ను పూర్తిగా నిషేధించ‌కుండా ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల భార‌త కంపెనీల‌కే కాదు, భార‌తీయుల‌కూ మేలు జ‌రుగుతుంద‌ని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news