భారత్ లో కరోనా కల్లోలం ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రతి రోజూ ఎనభై వేలకి పైగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఏ రోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరుగడం టెన్షన్ కలిగిస్తోంది. ఈరోజు ప్రపంచ రికార్డులని ఇండియా మళ్ళీ మార్చేసింది. మొన్న ఎనభై నాలుగు వేల కేసులతో రికార్డ్ సృష్టించగా ఈరోజు ఏకంగా తొంబై వేల కేసులతో రికార్డు బద్దలు కట్టింది. రోజు చేసే పరీక్షలు పెంచడంటో నమోదయ్యే కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగి పోతోంది.
కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 90,633 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 1,065 మంది మరణించారు. ఇక నిన్నటిదాకా నమొదయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 41 లక్షలను దాటింది. మొత్తం కేసుల సంఖ్య 41,13,812గా ఉంది. ఇక ఈ కేసులలో 8,62,320 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 31,80,866 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా కారణంగా ఇప్పటి వరకు దేశంలో 70,626 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా పరీక్షలను కూడా భారీగా చేస్తుంది కేంద్రం. ప్రతీ రోజు పది లక్షలకు పైగా పరీక్షలు చేయడం టార్గెట్ గా పెట్టుకుని మరీ పరీక్షలు చేస్తున్నారు.