పహల్గామ్ ఉగ్రదాడికి గట్టి ప్రతిస్పందనగా భారత్ “ఆపరేషన్ సిందూర్” నిర్వహించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) మరియు పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మొత్తం 24 దాడులు చేసింది. ఈ ముష్కర చర్యల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ తీవ్రవాదులు పెద్ద ఎత్తున హతమయ్యారు. ఈ దాడుల అనంతరం, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ప్రపంచ దేశాలకు భారత్ వైఖరిని స్పష్టంగా వివరించారు. భారత్‌కు ఘర్షణను పెంచే ఉద్దేశ్యం లేదని, కానీ పాక్ దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని మిత్ర దేశాలను హెచ్చరించారు.
ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపినట్టు, పాక్ ఆర్మీ లేదా పౌరులను లక్ష్యం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. దోవల్ యూఎస్, యూకే, రష్యా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, యూఏఈ, జపాన్, చైనా లాంటి కీలక దేశాల భద్రతా మరియు విదేశాంగ అధికారులు, సలహాదారులతో ఫోన్ కాల్ ద్వారా సంప్రదింపులు జరిపారు. అమెరికా ఎన్ఎస్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, యూకే జోనాథన్ పావెల్, చైనా మంత్రి వాంగ్ యి, ఫ్రెంచ్ అధ్యక్ష సలహాదారు ఇమ్మాన్యుయేల్ బోనేతో పాటు, ఇతర దేశాధికారులతో కూడా మాట్లాడారు. భారత్ ఉగ్రవాదంపై ఎలా నిర్ణయాత్మకంగా స్పందించిందో ఆయన వివరించారు.