వీళ్లకంతా సీనుందా అన్న టీమిండియా చరిత్ర సృష్టించింది

-

అనుభవం లేదు..వీళ్లు ఆడుతారా..మ్యాచ్‌కో కొత్త ఆటగాడు ఎంట్రీ ఇస్తున్నాడు.వీళ్లకంతా సీనుందా ఇదీ సిరీస్‌ సమయంలో వెటరన్ల కామెంట్లు. కానీ మెల్‌బోర్న్‌ నుంచి గబ్బా వరకు మూడు టెస్టుల్లో ఆ కుర్రాళ్లే ఆస్ట్రేలియాను అబ్బా అనిపించారు. కంగారులను సొంత గడ్డపై దెబ్బ కొట్టారు. టీమిండియాకు సంచలన విజయాన్ని అందించారు.

 

టెస్ట్‌ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది కుర్రాళ్లే. గతంలో టెస్టు అనుభవం లేని యువకులు నేరుగా ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశారు. నిర్భయంగా ఆడారు. ఎక్కడా చెక్కు చెదరలేదు. వరల్డ్‌ క్లాస్‌ బౌలర్లను ఎదుర్కొన్నారు. స్మిత్‌, వార్నర్‌ లాంటి బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించారు. శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ గురించి ఎంతచెప్పినా తక్కువే. పంత్‌ ఏకంగా ముందుండి జట్టును గెలిపించాడు. ఈ సిరీస్‌లో పంత్‌ ఇన్నింగ్స్‌ స్పెషల్‌గా నిలిచిపోతుంది.

భారత్‌కు టెస్ట్ జట్టుకు ఆడి.. అదరగొట్టాలన్నది ప్రతి ఒక్కరి కల. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని సమర్దంగా వినియోగించుకున్నారు. గబ్బా టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 1 వికెట్‌ తీసిన మహ్మద్‌ సిరాజ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు సాధించాడు. తండ్రికి ఘనంగా నివాళి అర్పించాడు. ఇక ఈ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగులు చేసిన గిల్‌ రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులతో విజయానికి పునాది వేశాడు. అంతకుముందు ఎంట్రీ ఇచ్చిన టెస్ట్‌లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. కమ్మిన్స్‌, హజల్‌వుడ్‌, స్టార్క్‌ లాంటి ఫాస్ట్‌ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. సీనియర్లు తడబడుతున్న సమయంలోనూ సులువుగా షాట్లు ఆడాడు శుభ్‌మన్‌ గిల్‌. భవిష్యత్‌ ఆశాకిరణంగా మారాడు.

వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తొలి టెస్ట్‌లో 200 లోపు చాపచుట్టేస్తామనుకున్న సమయంలో.. విరోచితంగా పోరాడింది ఈ జంట. 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. బ్యాటింగ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌లు హాఫ్‌ సెంచరీలు చేశారు. అటు బౌలింగ్‌లోనూ అదరగొట్టారు. రెండో ఇన్సింగ్స్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ కమ్మిన్స్‌ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్‌,ఫోర్‌ స్పెషల్‌గా నిలిచిపోతుంది.

ఇక ఆసీస్‌ పర్యటనలో టెస్ట్‌, వన్డే, టీ ట్వంటీ ఫార్మట్‌లో ఎంట్రీ ఇచ్చిన బౌలర్‌ నటరాజన్‌. చివరి టెస్ట్‌లో టెస్ట్‌ క్యాప్‌ అందుకున్న నట్టూ తనదైన యార్కర్లు, చక్కని బంతులతో విరుచుకుపడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో పరుగులు నియంత్రించాడు. టీమిండియాకు ఇక బెంగ అక్కర్లదు. ప్రధాన ఆటగాళ్లు గాయాలతో ఇంటి బాట పట్టినా.. రిజర్వ్‌ బెంచ్‌ అదరగొడుతోంది. నెట్‌ ప్రాక్టీస్‌ బౌలర్లే.. ఇప్పుడు ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లను బెదరగొట్టారు. కుర్రాళ్లోయ్‌.. కుర్రాళ్లు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news