నియోజకవర్గంలో పెత్తనానికి మాజీ ఎమ్మెల్యే ఎత్తులు

-

పేరుకి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నా పెత్తనం మాత్రం తానే చేయలనుకుంటున్నారు.తమవారి జోలికి వెళ్లి కొరివితో తలగోక్కోవద్దనే అధికారులకు వార్నింగ్ లు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డిలో దూకుడు పెంచారట..తన మాట వినని అధికారిని బదిలీ చేసి ఇప్పుడు జిల్లాలో రాజకీయ చర్చకు కారణమయ్యాడు.

మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్ధి జగ్గారెడ్డి చేతిలో ఓడిపోయారు. అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు సదాశివపేట మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేశారు ప్రభాకర్‌. టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నా.. ఇక్కడ తన చేతిలో పవర్‌ లేదని ప్రచారం జరిగితే పరువు పోతుందని భావించారో ఏమో.. సదాశివపేట మున్సిపల్‌ కమిషనర్‌ ను బదిలీ చేయించారు. ఇప్పుడు సదాశివపేట మున్సిపల్‌ కమిషనర్‌ బదిలీ రాజకీయ దుమారం రేపుతోంది. ఇక్కడ పట్టు నిలుపుకొనేందుకు చింతా ప్రభాకర్‌ కమిషనర్‌ ని బదిలీ చేయించారనే చర్చ నడుస్తుంది.

సదాశివపేట కమిషనర్‌గా స్పందన బాధ్యతలు చేపట్టిన 9నెలలకే బదిలీ జరగడం ఒక చర్చ అయితే.. దాని వెనక జరిగిన పరిణామాలు అధికార పార్టీలో ఆసక్తి రేపుతున్నాయి. కమిషనర్‌గా స్పందన వచ్చిన తర్వాత సదాశివపేటలో అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని కట్టడాలపై కొరడా ఝుళిపించారు. అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లు వచ్చినా ఆమె పట్టించుకోలేదట. సదాశివపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఒక మహిళ ఉన్నారు. వైస్‌చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ సోదరుడు గోపాల్‌ కొనసాగుతున్నారు. ఇక్కడ పెత్తనం అంతా గోపాల్‌దే. మున్సిపాలిటీలో తన మాటే నెగ్గాలన్నది వైస్‌ చైర్మన్‌ పంతంగా చెబుతారు పార్టీ కార్యకర్తలు.

అక్రమ నిర్మాణాల విషయంలో పలుమార్లు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలోనే కమిషనర్‌కు, గోపాల్‌కు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయట. స్పందనను ఆందోల్‌ జోగిపేట మున్సిపాలిటీకి బదిలీ చేయించారు. సొంత మున్సిపాలిటీపై పట్టుకోల్పోతే రాజకీయంగా రాంగ్‌ సిగ్నల్స్‌ వెళ్తాయని ఆయన భావించారట. తాము చెప్పినట్టు నడుచుకోవాలని లేదంటే రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయని కూడా కమిషనర్‌ను మాజీ ఎమ్మెల్యే సుతిమెత్తంగా హెచ్చరించారని కూడా పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయితే పని విషయంలో ముక్కుసూటిగా ఉంటే కమిషనర్‌ స్పందన మాజీ ఎమ్మెల్యే చెప్పినదానికి నో అన్నారట.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు తమ సామాజికవర్గానికి ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం చెప్పారని.. అది తనకే వస్తుందని అనుచరులకు చెబుతున్నారట ప్రభాకర్‌. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా.. వచ్చామా.. పని చూసుకున్నామా.. వెళ్లామా అన్నట్టు ఉండాలని స్పష్టం చేస్తున్నారట. అంతేకాదు..కమిషనర్‌ స్పందన బదిలీ కాగానే గతంలో ఆమె సీజ్‌ చేసిన దుకాణాలు 24 గంటల్లోనే తెరుచుకున్నాయి. అక్రమ కట్టడాల కూల్చివేతలు ఆగిపోయాయి. ప్రస్తుతం ఈ అంశం సంగారెడ్డి జిల్లాలో రాజకీయ వేడి రగిలిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news