చైనాకు చెందిన టెలికాం ఉత్పత్తుల తయారీదారు హువావేపై గతంలో అమెరికా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. హువావేకు చెందిన హార్డ్‌వేర్‌ను ఏ కంపెనీ కూడా ఉపయోగించవద్దని అమెరికా తమ కంపెనీలపై ఆంక్షలు విధించింది. అయితే త్వరలో భారత్‌లోనూ హువావేపై నిషేధం విధిస్తారని తెలుస్తోంది. అందుకు జూన్ వరకు డెడ్ లైన్‌ను కేంద్రం విధించినట్లు సమాచారం. దీంతోపాటు మరో చైనా టెలికాం ఉత్పత్తుల తయారీదారు జడ్‌టీఈపై కూడా కేంద్రం నిషేధం విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నిజానికి మన దేశంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు ఎక్కువగా హువావేకు చెందిన టెలికాం ఉత్పత్తులు, ఇతర సామగ్రిని వాడుతున్నాయి. అయితే ఉన్నపళంగా నిషేధం విధిస్తే ఈ రెండు మాత్రమే కాదు, ఇతర కంపెనీలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకనే కేంద్రం జూన్ నెలను డెడ్‌లైన్‌గా విధించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఇక చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇప్పటికే భారత్ 200కు పైగా చైనా యాప్‌లపై నిషేధం విధించింది. అలాగే గతేడాది జూన్ నెలలో 150 చైనా కంపెనీలు భారత్‌లో 2 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. అందుకు భారత్ స్పందించలేదు. వాటిని ఇంకా పెండింగ్‌లో ఉంచింది. అవన్నీ టెలికాం రంగానికి చెందినవే కావడం విశేషం.
అయితే హువావే, జడ్‌టీఈ కంపెనీలు తమ హార్డ్‌వేర్‌లలో బ్యాక్‌డోర్ వల్‌నరబిలిటీస్‌ను ఇన్‌స్టాల్ చేసి వాటిని భారత్‌కు సరఫరా చేస్తున్నాయని, వాటి సహాయంతో చైనా భారత టెలికాం కంపెనీల ద్వారా భారతీయులపై నిఘా పెడుతుందని తెలిసింది. అందుకనే హవావే, జడ్‌టీఈ సంస్థలపై నిషేధం విధించాలని కేంద్రం ఆలోచిస్తోంది. అయితే దీనిపై ఆ రెండు సంస్థలు ఇంకా స్పందించలేదు. కానీ నిషేధం గనక అమలులోకి వస్తే అప్పుడు ఆ రెండు కంపెనీలకు భారీ మొత్తంలో నష్టం సంభవిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.