వాహనదారులపై మళ్లీ పెట్రో దెబ్బ తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న పెట్రోల్ ధరలతో సగటు వినియోగదారుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మళ్లీ పెట్రోల్ ధరలు పెరిగితే ప్రజల జేబులకు చిల్లు పడనుంది. అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు గత 4 వారాల్లో ఏకంగా 25 శాతం పెరిగి ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో పెట్రోల్, డిజిల్ ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం కనిపిస్తోంది. గతేడాది ఆల్ టైం హైకి పెట్రోల్ , డిజిల్ ధరలు చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్ ఒకానొక దశలో రూ. 110 దాటింది.
అయితే కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా లీటర్ పెట్రోల్ పై రూ.5 , డిజిల్ పై రూ. 10 పన్నులను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించింది. కేంద్రం బాటలోనే బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా పెట్రోల్, డిజిల్ ధరలపై పన్నులను తగ్గించుకున్నాయి. దీంతో పెట్రోల్ ధర కొన్ని రాష్ట్రాల్లో రూ. 100 లోపే దొరుకుతుంది.