లండన్‌లో భారతదేశ త్రివర్ణ పతాకానికి అగౌరవం కలిగిన సంఘటన చోటుచేసుకుంది. ఖలిస్థాన్ అనుకూలవాదులు లండన్‌లోని భారత్ హైకమిషన్ భవనంపై ఎగురవేసిన జాతీయ జెండాను కిందికి దింపేసి అగౌరవ పరచిచారు. ఈ సంఘటనపై భారత్ మండిపడింది. ఈ మేరకు దిల్లీలోని బ్రిటన్ సీనియర్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.
లండన్‌లో ఖలిస్థాన్ వేర్పాటు వాదులు చేసిన పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భారత్ తెలిపింది. బాధ్యులపై వెంటనే అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేసింది. ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ అనుచరులను పంజాబ్ పోలీసులు అరెస్టు చేయడంపై రెండు రోజులుగా పంజాబ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రవాస సిక్కుల్లోని ఓ వర్గం లండన్‌లో నిరసనలు ప్రారంభించింది. లండన్‌లోని భారత హై కమిషన్ భవనంపై ఏర్పాటు చేసిన జెండాను కిందికి దించుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేసింది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన భారత విదేశాంగ శాఖ.. నిరసనకారులు భారత హైకమిషన్‌కు వచ్చేంత వరకు అక్కడి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై కూలంకషంగా వివరణ ఇవ్వాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.