దేశవ్యాప్తంగా గత 18 నెలల కాలంలో కేంద్రం మొత్తం 500 వరకు అశ్లీల వెబ్‌సైట్లను నిషేధించింది. అశ్లీలత, హింసలను ప్రేరేపించేవిధంగా ఉన్నాయన్న కారణంతో సైబర్ సెల్ ఆయా సైట్లను బ్యాన్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ వివరాలను వెల్లడించింది. గత 18 నెలల కాలంలో 50 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశామని ఆ శాఖ తెలిపింది.
సైబర్‌క్రైం ప్రివెన్షన్ ఎగెనెస్ట్ వుమెన్ అండ్ చిల్డ్రన్ (సీసీపీడబ్ల్యూసీ), సైబర్‌సెల్ ఫిర్యాదు మేరకు స్పందించిన కేంద్ర హోం శాఖ కేసుల విచారణ చేపట్టి మొత్తం 50 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసింది. కాగా ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోం శాఖ, సైబర్ సెల్‌లు కలిసి పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే అలాంటి వెబ్‌సైట్లను గురించి వాటిని నిషేధించే పనిలో పడ్డారు.
అయితే కొన్ని సోషల్ మీడియా పోస్టులు కూడా హింస, అశ్లీలతలను ప్రేరేపించే విధంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ తెలిపింది. అలాంటి పోస్టులను విదేశాల్లో నిషేధిత సంస్థలు పోస్ట్ చేస్తున్నాయని తెలియజేసింది. అయినప్పటికీ అలాంటి పోస్టులే కాకుండా, వెబ్‌సైట్లను కూడా గుర్తించి వాటిని తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు.
సైబర్ సెల్ డీసీపీ అనేష్ రాయ్ మాట్లాడుతూ.. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ప్రతినిధులతో మాట్లాడి అలాంటి పోస్టులను పెట్టేవారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే వాటిని ఆయా మాధ్యమాల నుంచి తొలగిస్తున్నామని తెలిపారు.