ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. దీంతో మనకు బ్యాంకుల పరంగా ఇప్పటికే అనేక సదుయాలు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లను మనం ఉపయోగించుకుంటున్నాం. దీనికి తోడు యూపీఐ ద్వారా నగదును క్షణాల్లోనే పంపుకునే సౌలభ్యం కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం అనేక రకాల బ్యాంకులు తమ కస్టమర్లకు వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తున్నాయి. దీంతో అనేక రకాల బ్యాంకింగ్ సేవలను వాట్సాప్‌లోనే పొందే వీలు కలుగుతోంది.
ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా తదితర బ్యాంకులు వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్నాయి. కస్టమర్లు తమకు కావాల్సిన సమాచారాన్ని వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా పొందే వీలు ఏర్పడింది. వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవల్ని పొందేందుకు ఎలాంటి సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
వాట్సప్ బ్యాంకింగ్ ద్వారా అకౌంట్ బ్యాలెన్స్, చివరి మూడు లావాదేవీల వివరాలు, క్రెడిట్ కార్డుల ఔట్ స్టాండింగ్ బ్యాలెన్స్, క్రెడిట్ కార్డ్ లిమిట్, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయడం లేదా అన్‌బ్లాక్ చేయడం, ప్రీ-అప్రూవ్డ్ లోన్ల వివరాలు తెలుసుకోవడం, ఇన్‌స్టా సేవ్ సేవింగ్స్ అకౌంట్ ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయడం లాంటి సేవల్ని పొందవచ్చు. ఎవరైనా సరే వాట్సప్ బ్యాంకింగ్ సేవలను పొందాలనుకుంటే ముందుగా బ్యాంకుకు సంబంధించిన వాట్సప్ నంబర్ ను అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
యూజర్లు తమకు కావాలనుకున్న బ్యాంక్‌కు చెందిన వాట్సాప్ నంబర్‌ను ముందుగా ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. అనంతరం ఆ నంబర్‌కు వాట్సప్ లో Hi అని టైప్ చేసి మెసేజ్ చేయాలి. ఆ తర్వాత వాట్సప్ బ్యాంకింగ్ నియమ నిబంధనల్ని అంగీకరించాలి. దీంతో యూజర్లు వాట్సప్‌లోనే బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. వాట్సప్‌లో ఎన్‌క్రిప్షన్ ఫీచర్ ఉంటుంది కనుక యూజర్ల మెసేజ్‌లు సురక్షితంగా ఉంటాయి.