కరోనా లాక్‌డౌన్ కారణంగా భారత్‌లో చిక్కుకున్న విదేశీయులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 1 తరువాత ఎక్స్‌పైర్ అయిన విదేశీయుల వీసాలను ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దవడంతోపాటు ప్రయాణాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎంతో మంది విదేశీయులు భారత్‌లో చిక్కుకుపోయారు. వారి కోసమే వారి వీసాలను ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కాగా వీసా, ఈ-వీసా కలిగిన విదేశీయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే వారి వీసాలను ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించనున్నారు. అయితే ఏప్రిల్ 30 తరువాత అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభం అయితే.. అప్పుడు విదేశీయులు మళ్లీ తమ సొంత దేశాలకు వెళ్లేందుకు వీలుంటుంది. అయితే ఆ సమయంలో ఎలాంటి అదనపు రుసుమును కూడా వసూలు చేయబోమని కేంద్రం తెలిపింది.
ఇక ఇప్పటికే మన దేశంలో చిక్కుకున్న విదేశీయులను ఆయా దేశాలు ప్రత్యేక విమానాలు పంపి మరీ తమ దేశాలకు తీసుకెళ్తున్నాయి. కానీ అమెరికా, బ్రిటన్‌లకు చెందిన కొందరు పౌరులు ఆయా దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల అక్కడికి వెళ్లడం కంటే ఇండియాలో ఉండడమే ఉత్తమమని భావించి ఇక్కడే ఉంటున్నారు. మరి ఏప్రిల్ 30వ తేదీ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.