ప్రస్తుతం ప్రపంచదేశాల్లో కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పెద్దన్నగా చెప్పుకునే ఆగ్రరాజ్యం అమెరికా కరోనా ముందు బానిసలా బతకాల్సి ఉంది. గత ఏడాది డిసెంబర్‌లో చైన నుంచి పుట్టుకొచ్చిన ఈ వైరస్ అనాలి కాలంలో ఏ స్థాయిలో ప్రపంచదేశాలు పాకిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నా.. పెద్దా, పేద.. ధనిక అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెట్టిస్తుంది ఈ కరోనా. అయితే ప్రస్తుతం కరోనాకు మందు లేకపోవడంతో.. నివారణపైనే దృష్టి పెట్టారు.
ఇందులో భాగంగా.. భౌతిక దూరం ఉంటే కరోనానను కట్టడి చేయగలం అని భావించిన ప్రభుత్వాలు ఎక్కడికక్కడ లాక్‌డౌన్ విధించాయి. అందులో భారత్ కూడా ఒకటి. అయితే లాక్‌డౌన్ సామాన్యుల పరిస్థితి ఏమోగాని.. మందుబాబుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. ఎప్పుడూ చుక్కపడి కిక్కుతో ఉండే ఈ మందుబాబు లాక్‌డౌన్ దెబ్బకు పిచ్చెక్కిపోతున్నారు. మరోవైపు కొందరు పాన్ మసాలా వేసుకోక నోరు పిడసకట్టుకుపోయిందంటూ బాధపడటంతో ఓ వ్యాపారి వినూత్న ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే పాన్ మసాలాను ఏకంగా డ్రోన్ సాయంతో హోం డెలివరీ చేశారు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..గుజరాత్ లోని మోర్బి ప్రాంతం నుండి పాన్ మసాలాను ఇళ్లకు డెలివరీ చేయడానికి డ్రోన్ వినియోగిస్తున్నారు. ప్రజలు తమ అలవాట్లను మానుకోలేక డ్రోన్ సాయంతో తమ కోరికలను తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. విషయం పోలీసులకు తెలియడంతో డ్రోన్‌తో పాన్ మసాలా హోం డెలివరీ చేసే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.