కరోనా మొదటి వేవ్‌లోనే చాలా మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయారు. ఇక సెకండ్ వేవ్ వల్ల కొన్ని కోట్ల మంది మళ్లీ ఉద్యోగాలను కోల్పోయారు. అనేక మంది ఉపాధి కరువు బతుకు బండిని చాలా భారంగా ఈడుస్తున్నారు. ఎంతో మంది పేదిరకంలోకి నెట్టివేయబడ్డారు. అయితే ఇలాంటి ఆపద సమయంలో ఆ అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రాంతంలో మే 31వ తేదీ వరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలను వసూలు చేయకూడదని లోన్ల రికవరీపై నిషేధం విధించారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అక్కడి అడిషనల్ కలెక్టర్ పవన్ జైన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వల్ల చాలా మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయి తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. అనేక మంది తీసుకున్న రుణాలను చెల్లించలేకపోతున్నారు. దీంతో అలాంటి వారి నుంచి లోన్లను రికవరీ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. లోన్ల రికవరీపై మే 31వ తేదీ వరకు నిషేధం విధించారు. తాము చెప్పే వరకు రుణ గ్రహీతల నుంచి లోన్లను రికవరీ చేయరాదని, వారిని ఇబ్బందులకు గురి చేయరాదని తెలిపారు.
కాగా మధ్యప్రదేశ్ లో ప్రస్తుతం లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో అక్కడ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం ప్రజలకు ఊరట కలిగించే అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తోంది. కరోనా నిబంధనలను ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు.