మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కు చెందిన 26 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి 5 రోజుల్లో ఇదరు యువతులను వివాహం చేసుకున్నాడు. అనంతరం పారిపోయాడు. కాగా బాధిత యువతుల్లో ఓ యువతికి చెందిన కుటుంబ సభ్యులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు సదరు ఉద్యోగిపై కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతంలో ఉన్న ముసాఖెడికి చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి డిసెంబర్ 2న ఖాండ్వాకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వారి నుంచి కొంత నగదు, ఇంటి సామగ్రిని కూడా అతను తీసుకున్నాడు. అనంతరం ఆ యువతిని తన ఇంటికి తీసుకెళ్లాడు. తనకు అర్జంట్ ఆఫీస్ పని ఉందని చెప్పి డిసెంబర్ 7న ఇండోర్‌లోని మొహవ్‌కు వచ్చి అక్కడ మరో యువతిని అతను పెళ్లి చేసుకున్నాడు.
కాగా మొదట వివాహం చేసుకున్న యువతికి చెందిన ఓ బంధువు మొహవ్ పెళ్లికి వచ్చాడు. అక్కడ పెళ్లి కొడుకుని చూసి షాక్ తిన్నాడు. అంతకు 5 రోజుల ముందు జరిగిన పెళ్లి తాలూకు ఫొటోలను అక్కడి వారికి చూపించాడు. ఈ క్రమంలో ఆ పెళ్లి కొడుకు అక్కడి నుంచి జారుకున్నాడు. కాగా విషయాన్ని ఖాండ్వా యువతికి చెప్పగా ఆ యువతి తరఫు కుటుంబ సభ్యులు ఖాండ్వా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి సదరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఖాండ్వా యువతికి చెందిన కుటుంబ సభ్యులు పెళ్లికి గాను రూ.10 లక్షలు ఖర్చు చేశామని, ఆభరణాలు, ఇంటి సామగ్రిని పెళ్లి కొడుక్కి ఇచ్చామని తెలిపారు.