గురువారం సాయంత్రం నాగపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞానవాపి మసీదు అంశం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వివాదాన్ని ఎందుకు పెంచాలి. సమిష్టి నిర్ణయంతో జ్ఞానవాపి వివాదానికి ముగింపు పలకవచ్చు కదా! అని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని ప్రాంతాల పట్ల ప్రత్యేక భక్తిని కలిగి ఉంటాము. వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడతాం కూడా. కానీ ప్రతిరోజూ కొత్త విషయంతో వివాదం రాజేయడం ఎందుకు?.. జ్ఞానవాపి విషయం మనకు భక్తి ఉండొచ్చు. అలాగని ప్రతి మసీదుల్లో శివలింగం వెతకడం ఎంతవరకు సమంజసం. అని హిందూ సంఘాలను ప్రశ్నించారు మోహన్ భగవత్.
జ్ఞానవాపి అంశం ఈనాటిది కాదు. ఇప్పుడున్న హిందువులో, ముస్లింలో దానిని సృష్టించింది కాదు. ఆ సమయానికి అది అలా జరిగిపోయింది. బయటి దేశాల నుంచి వచ్చిన కొందరు దేవస్థానాలను నాశనం చేశారు. అలాగని ముస్లింలు అందరినీ అలా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ముస్లింలలో కొందరి పూర్వీకులు కూడా హిందువులే! సమిష్టిగా సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలి. అందుకు ఒక మార్గం కనిపెట్టాలి. కుదరనప్పుడు కోర్టులకు చేరాలి. అక్కడ ఎలాంటి నిర్ణయం ఇచ్చిన అంగీకరించి తీరాలి. ఆర్ఎస్ఎస్ ఏ మత ప్రార్థనా విధానాలకు వ్యతిరేకంగా కాదు. అందరినీ అంగీకరిస్తుంది అని తన ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు.