అసలు వీళ్లకు సోషల్‌మీడియా అవసరమా..?

-

ఇష్టారాజ్యంగా ఫోటోలు పెట్టడమెందుకు? వాడెవడో కామెంట్‌ చేసాడని ఏడవడం ఎందుకు? ముందునుంచే సెలెబ్రిటీ స్టేటస్‌ అనుభవిస్తున్నా, ప్రత్యేకంగా సోషల్‌మీడియా పోస్టులు ఎందుకు?… వాళ్లూవీళ్లు ఒకేరకం శాడిస్టులు.

అనసూయా భరద్వాజ్‌.. తెలుగు టీవీ-సినీ రంగాల్లో బాగా పాపులర్‌ అయిన పేరు. ముఖ్యంగా టివీలో సూపర్‌స్టార్‌ యాంకర్‌గా ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చుకుంది. ఆ పాపులారిటీతోనే సినిమాల్లో కూడా అవకాశాలు అందిపుచ్చుకుంది. ఐటం సాంగులు, సపోర్టింగ్‌ పాత్రలతో అక్కడ కూడా ఫేమస్‌ అయింది. మంచి ఆర్టిస్టు, డ్యాన్సర్‌ కూడా.

తెలంగాణలోని నిజామాబాద్‌ నుండి ఎదిగిన స్టార్‌. మంచి కుటుంబ నేపథ్యం. పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా. వినోద రంగం దయవల్ల పేరు, డబ్బు బాగానే సంసాదించింది. ఇక కొత్తగా వచ్చే పేరేమీ లేదు. ఆ అవసరం కూడా లేదు. కానీ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. దాంతో పనీపాట లేని వెధవలు వేలల్లో ఆమెకు ఫేస్‌బుక్‌లోనూ, ట్విటర్‌లోనూ ఫాలో అవుతున్నారు.


అయితే సోషల్‌మీడియా వేదికగా సామాజిక సమస్యలపై అప్పుడప్పుడూ స్పందించే అనసూయ, తన చిత్రవిచిత్ర ఫోటోషూట్‌ల తాలూకు అన్ని ఫోటోలు మాత్రం ఎప్పటివప్పుడు అప్‌డేట్‌ చేస్తుంటుంది. సరే… వాటి లక్ష్యం మాత్రం ఈ వెంటాడుతున్న వెధవలను ఎంటర్‌టెయిన్‌ చేయడమే కాక, కొత్త కొత్త ఆఫర్‌లను ఆకర్షించడం కూడా కావచ్చు. కానీ, వేలమంది ఫాలోవర్స్‌లో ఇద్దరో ముగ్గురో మానసిక దౌర్భాగ్యులు కూడా ఉంటారు. వారి నోటికి సాధారణంగానే అడ్డూఅదుపు ఉండదు. ఇక ఇటువంటి ఫోటోలు చూసినప్పుడు ఎలా ఊరుకుంటారు? అసలు వాళ్లు వీళ్లని ఫాలో అవడంలో ఉద్దేశ్యమే ఈ ఫోటోలు చూసి చొంగ కార్చుకోవడానికి. నూటికి 99 మంది పర్పస్‌ అదే. చొంగ కార్చుకోవడం అందరికీ కామన్‌. నోటికొచ్చినట్టు కామెంట్‌ చేసేది మాత్రం చీప్‌ మెంటల్‌ వెధవలే.


అసలు ఈ సెలబ్రిటీల సమస్య ఏమిటి? సోషల్‌మీడియాలో ఇట్లాంటి హడావుడి ఎందుకు? ఏది బడితే అది పోస్ట్‌ చేసి, వెర్రిమాలోకాలు అందరూ వాటిని చూస్తూ ఎగబడుతుంటే, వచ్చిన టైకులు చూసి పైశాచికానందం పొందుతుంటారు. నిజానికి వారికంటే వీరేమీ తక్కువ కాదు. వాళ్లదోరకం శాడిజం. వీళ్లదోరకం శాడిజం. వ్యక్తిగతమైన విషయాల విలువ చాలా ఎక్కువ. ఆ ఆనందం పూర్తిగా ఎవరికివారి సొంతం. పెళ్లవడం, కడుపవడం, సీమంతం, సంగీత్‌, పిల్లలు పుట్టడం, విడాకులు తీసుకోవడం లాంటివి తమ స్వంత విషయాలు. సోషల్‌మీడియాలో పెట్టి వాటిని బజారున ఎందుకు పడేసుకోవడం.? ఇక్కడ ఎవరి విలువ తగ్గిపోతుంది?


ఈమధ్య ఎవరో ఒక మాజీ హీరో(?) తనకు నాలుగోసారి పాపో బాబో పుట్టారని పెద్ద దేశభక్తుడిలా పోస్ట్‌ పెట్టాడు. ఇంచుమించు అదే సమయానికి ఆయన తమ్ముడు తాను విడాకులు తీసుకున్నట్లు పోస్ట్‌ రాసాడు. మాజీ టాప్‌ హీరోయిన్‌ ఒకావిడ జిమ్‌లో ఎక్సర్‌సైజులు చేస్తూ ఫోజులిచ్చి, వాటిని అప్‌డేట్‌ చేస్తుంది. ఎందుకిలా? ఆయనకు నలభైవ కొడుకు పుడితే జనాలకెందుకు? ఈయనకు విడాకులొస్తే మనకెందుకు?  ఈవిడ కండలు కరిగిస్తే మనకేంటి లాభం? ఇటువంటివి లక్షల సంఖ్యలో రోజూ ఉంటాయి. ఇలా ఉంటున్నప్పుడు ఎలాంటివాటికైనా సిద్ధంగా ఉండాలి. కాదంటే తమ సోషల్‌మీడియా అకౌంట్లు డిలీట్‌ చేయాలి. అప్పుడు వేలాదిమంది ప్రశాంతంగా ఉంటారు. వారితో సహా. ఈ తరహా పోస్టులతో నిర్వహించే సామాజిక మాధ్యమాలతో వీరు దేశాన్ని ఉద్ధరిస్తున్నదేమిటి? సమాజానికి చేస్తున్న సేవేమిటి? అప్పుడోసారి, ఇప్పుడోసారి దిశకు నివాళి అర్సిస్తే, సైకో శ్రీనివాసరెడ్డిని తిడితే దేశభక్తులైపోరు. బాధ్యతనెరిగి ప్రవర్తించాలి. తాము వేసే ఒక్క అడుగు వేలాదిమందిని ప్రభావితం చేస్తుందన్న నిజం గుర్తించాలి.


సెలెబ్రిటీలను ఫాలో అవుతున్న యువత కూడా నిజాన్ని గ్రహించాలి. వారి లక్ష్యం కేవలం డబ్బు సంపాదన మాత్రమే. దానికి ఈ ఫాలోవర్లు పనిముట్లుగా ఉపయోగపడుతున్నారు. పొరపాటున దగ్గరగా వెళితే, పురుగులను చూసినట్లు చూస్తారు. కొంతమంది సన్నాసులైతే కొడతారు కూడా. ఇదే అనసూయ ఒకసారి తార్నాకలో ఒక చిన్న పిల్లాడి ఫోన్‌ పగులగొట్టింది. సోషల్‌మీడియాలో ఇలాంటివాళ్ల వెంబడిపడితే ఒక్క పైసా లాభం లేదు. చక్కగా చదువుకోండి. అమ్మానాన్న చెప్పినట్లు వినండి, కష్టపడి పనిచేసుకోండి. ఇవే మిమ్మల్ని కాపాడతాయి. సమాజంలో మీకో విలువను, గౌరవాన్ని సంపాదిస్తాయి.

  • రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news