నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క అధికార పార్టీ తప్ప.. మిగిలిన పక్షాలంతా కూడా బీసీల జపం చేస్తున్నాయి. తాజాగా హైకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ తీర్పుపై ఈ పక్షాలన్నీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను చట్ట విరుద్ధమని హైకోర్టు తాజాగా ప్రకటించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని, అలా జరగడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 డిసెంబర్ 28న ప్రభుత్వం జారీ చేసిన జీవో 176ను రద్దు చేసింది.
అంతేకాదు, రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఎన్నికలు నిర్వహించ వచ్చని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లేందుకు జగన్ ప్రభుత్వం రెడీ అయింది. అయితే, ఇప్పటి వరకు మౌనంగా ఉన్న టీడీపీ, సీపీఐ, సీపీఎం వంటి ప్రతిపక్షాలు.. ఒక్కసారిగా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడడంతోపాటు.. బీసీలపై అమితమైన ప్రేమ కురిపించేస్తున్నాయి. బీసీల వెన్నుముకను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విరిచేశారని టీడీపీ నేత కూన రవికుమార్ విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్వేషి అని టీడీపీ నేత, మాజీమంత్రి నక్కా ఆనందబాబు దుయ్యబట్టారు.
అదేవిధంగా.. బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు జగన్‌కు ఇష్టం లేదని మాజీ మంత్రి యనమల రామకృ ష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. బీసీలకు 15 వేల పోస్టులు రాకుండా జగన్ అడ్డంకులు సృష్టిస్తు న్నారని ఆరోపించారు. టీడీపీ వెన్నెముక బీసీలని తెలిసే వారిపై కక్షగట్టారని ఆయన ఆరోపించారు. స్థాని క సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిథ్యం తగ్గించేందుకే ఇలాంటి చర్యలు చేపట్టారని అన్నారు. ఇక, బీసీ రిజర్వేషన్లపై జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. సీపీఎం నేతలు కూడా ఇదే బాటలో కొన్ని డిమాండ్లు చేశారు. అయితే, ఇక్కడ అర్ధం కాని విషయం.. ఈ నేతల వ్యూహాత్మక రాజకీయం ఏంటంటే.. రిజర్వేషన్లను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలై మూడు నెలలు అయింది.
ఈ పిటిషన్‌పై అనేక సార్లు విచారణలు కూడా జరిగాయి. మరి ఆ సమయంలో వీరికి తెలియదా.. రిజర్వేష న్లు బీసీలకు వర్తించేలా తీర్పు చెప్పండి.. అని హైకోర్టును అడగడం.. ఆ సమయంలో వీరికి గుర్తులేదా.. ఈ పిటిషన్‌లో ఇంప్లీడ్ అయి.. బీసీలకు న్యాయం జరిగేలా చూడాలని!పైగా ఈ పిటిషన్ వేసిన వారికి పరోక్షంగా సహకరించింది ఎవరో.. అందరికీ తెలిసిందే. జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా.. రిజర్వేషన్లను 59.3 శాతం తీసుకువస్తే.. జగన్‌కు ఎక్కడ లబ్ధి చేకూరుతుందోనని భావించి అప్పట్లో మౌనం వహించారు. అంటే.. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో.. తెలిసి కూడా నాటకాలు ఆడారు. అప్పట్లో లేని బాధ, అప్పుడు గుర్తుకు రాని బీసీలు ఇప్పుడు ఒక్కసారిగా ఈ పార్టీలకు గుర్తుకు వచ్చారు.
దీంతో ఇప్పుడు బీసీలకు జరుగుతున్న, జరగనున్న అన్యాయాన్ని జగన్ ఖాతాలో వేసి పైశాచిక లబ్ధిని పొందాలనే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. సుప్రీం కోర్టుకు వెళ్తే.. మేం కూడా ఇంప్లీడ్ అయి బీసీలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరతామని చెబుతున్న టీడీపీ ఇప్పటి వరకు హైకోర్టు లో జరిగిన విచారణను వినిపించుకోలేదా? ఇక్కడ అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా మౌనం పాటించడం నిజం కాదా! ఏదేమైనా.. టీడీపీ రాజకీయ లబ్ధి కోసం ఆడిన నాటకంలో నష్టపోతోంది నిజంగా ఆ పార్టీ తన వెన్నెముక అని చెప్పుకొనే బీసీలే అనడంలో సందేహం లేదు!!