ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించిన యువ నాయకుడు గొట్టిపాటి రవి రాజకీయం భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఆయనటీడీపీలో ఉన్నారు. 2014లో వైసీపీలో ఉండి.. ఆ పార్టీ టికెట్‌పై అద్దంకిలో విజయం సాధించారు. అంతే కాదు, వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత వినయశీలిగా, మిత్రుడిగా కూడా గొట్టిపాటి గుర్తింపు సాధించారు. ఇలా ఉన్న నాయకుడు తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఆకర్ష్ మంత్రంతో పార్టీ మారిపోయారు. అప్పటి వరకు వైసీపీలో ఉన్న గొట్టిపాటి టీడీపీ సైకిల్ ఎక్కారు. ఏం ఆశించి పార్టీ మారారో.. ఆయనకే తెలియాలని అప్పట్లో వైసీపీలోనే చర్చ సాగింది. ఇక, తర్వాత గత ఏడాది ఎన్నికల్లోనూ ఆయన టీడీపీ టికెట్ పై విజయంసాధించారు.
నిజానికి టీడీపీలో భారీ ఎత్తున కీలక నాయకులు కూడా ఓడిపోయారు. కానీ, గొట్టిపాటి మాత్రం విజయం సాధించారు. అయితే, పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నా కూడా టీడీపీ చతికిల పడింది. అదేసమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీం తో గొట్టిపాటికి వైసీపీ నుంచి ఆహ్వానాలు అందాయి. పార్టీలోకి తిరిగి రావాలంటూ.. ఆయనపై ఒత్తిడి పెరిగింది. అయితే, ఆదిలో ఆయన భీష్మించారు. నియోజకవర్గంలో పరిస్థితిని, తన రాజకీయ భవిష్యత్తును సమతుల్యం చేసుకోవడంలో గొట్టిపాటి విఫల మయ్యారు. దీంతో ఆయన టీడీపీలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన సంబంధించిన గనుల వ్యాపారాలపై అధికారులు కొరడా ఝళిపించారు. దాదాపు 300 కోట్ల రూపాయలు ఫైన్ కూడా విధించారు.
దీంతో గొట్టిపాటి ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. ఇక, ఈ సమయంలో తన పక్షాన టీడీపీ నిలబడుతుందని ఆయన అనుకున్నారు. కానీ, చంద్రబాబు కు సంకట స్థితి ఏర్పడింది. ఏం మాట్లాడాలో తెలియలేదు. గొట్టిపాటి పక్షాన నిలబడితే.. రాజధాని ప్రాంతంలో ఇదే సమస్యను ఎదుర్కొంటున్న యరపతినేని శ్రీనివాసరావు వంటివారినికూడా వెనుకేసుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇది మరింత వివాదం అవుతుందని భావించిన బాబు మౌనం పాటించారు. దీంతో గొట్టిపాటి తీవ్రంగా హర్ట్ అయ్యారు. కీలక సమయంలో పార్టీ తనను ఆదుకోలేదని, అండగా నిలవలేదని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు కానీ, చంద్రబాబు పిలుపు మేరకు జరుగుతున్న నిరసనలకు కానీ ఆయన ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
ఆయన పనేదో ఆయన చూసుకుంటున్నారు. అనుచరులకు కూడా అందుబాటులో రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడుతారా? అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. ఇప్పటికే గొట్టిపాటికి యాంటీగా ఉన్న కరణం కుటుంబాన్ని వైసీపీలోకితీసుకున్నారు. ఈ నేపథ్యంలో తనకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని తనకు అత్యంత సన్నిహితులతో చెప్పుకొని గొట్టిపాటి లబోదిబో మంటున్నారని సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఏం చేస్తారో చూడాలి.