ఏపీ ప్రధాన విపక్షం టీడీపీలో గడిచిన వారం రోజులుగా ఆసక్తికర విషయంపై చర్చ నడుస్తోంది. అదే.. యువ నటుడు, నందమూరి అందగాడు జూనియర్ ఎన్టీఆర్ గురించి. ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయడంతోపాటు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో ఆయన పార్టీపై ఫైరయ్యారు. చంద్రబాబును, ఆయన కుమారుడిని కూడా ఉతికి ఆరేశారు. ఈ సందర్భంగానే జూనియర్ ప్రస్తావనను తెరమీదికి తెచ్చారు. 2009 ఎన్నికల సమయంలో ఆయనను వాడుకుని వదిలేశారంటూ వ్యాఖ్యానించారు.
అంతేకాదు, జూనియర్ ప్రచారం చేసిన నియోజకవర్గాల మ్యాప్‌ను బాబుకు అనుకూల మీడియాలో ప్రచురించి అక్కడ పార్టీ ఓట్లు తగ్గిపోయాయనే ప్రచారం చేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో జూనియర్‌ను వదిలేసి పవన్‌కళ్యాణ్‌ను భుజాలపైకి ఎక్కించుకున్నారని వ్యాఖ్యానించారు. జూనియర్ వస్తే.. తన కొడుకు లోకేష్‌కు డోర్లు క్లోజ్ అయిపోతాయని భావించే ఇలా చేస్తున్నారని, లోకేష్ పార్టీలో ఉంటే మరింత మంది బయటకు రావడం, ఇక, టీడీపీ పడవ మునిగి పోవడం, ధర్మాడి సత్యం వంటి వారు కూడా ఈ పడవను కాపాడే పరిస్థితి ఉండదని వ్యాఖ్యానించడం తెలిసిందే.
అయితే, ఇటు వంశీ వ్యాఖ్యలపైకానీ, అటు మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై కానీ.. ఇతమిత్థంగా టీడీపీ నేరుగాస్పందించలేదు. ముఖ్యంగా జూనియర్ విషయంలో ఏమీ చెప్పలేదు. విమర్శించనూ లేదు. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు అన్నట్టుగా ఒకమాట అనేసి పక్కకు తప్పుకొన్నారు. అయితే, ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితి లో జూనియర్ వంటి బలమైన నాయకుడి అవసరం ఎంతైనా ఉందనేది వాస్తవం. కానీ, పార్టీలో తన తాత ఎన్టీఆర్‌కు, తన తండ్రి హరికి, చివరకు తనకు కూడా జరిగిన అవమానాల నేపథ్యంలో పార్టీకి దూరంగా ఉంటున్నారు జూనియర్.
గత ఏడాది తెలంగాణ ఎన్నికల సమయంలో సొంత సోదరి కూకట్‌పల్లి నుంచి పోటీ చేసిన సమయంలో కూడా జూనియర్ పార్టీ తరఫున ప్రచారానికి రాలేదు. దీనిని బట్టి ఆయన వచ్చే అవకాశం లేదనే ప్రచారం సాగుతోంది. కానీ, ఇప్పుడు బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీని ముందుకు నడిపించేందుకు జూనియర్ సాయం తీసుకుంటారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు పార్టీ నిలబడితేనే.. వచ్చే ఎన్నికల నాటికి అంతో ఇంతో మళ్లీ పోటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ, బాబు అలా ఆలోచన చేస్తాడా? లేదా? అనేది వేచి చూడాలి. ఒకవేళ స్వయంగా ఆయనే పిలిచినా జూనియర్ వస్తాడా? అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.