మహారాష్ట్రలో అధికార లక్ష్మి దాదాపు 50 రోజుల నుంచి అటు ఇటు దోబూచులాడుతూ చివరికి బిజెపి గుమ్మం ముందు వాలింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ రెండో సారి ప్రమాణ స్వీకారం చేయడంతో ఒక్కసారిగా కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు షాక్ తిన్నాయి. ఎన్సీపీ ఎమ్మెల్యేలు పది మందితో కలిసి ఈ రోజు ఉదయం రాజభవన్ కి వెళ్ళిన సీనియర్ నేత అజిత్ పవార్… ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఒక్కసారిగా ఎన్సీపీ నేతలు కంగుతిన్నారు.
అసలు ఏం జరుగుతుందో తనకు కూడా అర్ధం కావడం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అటు ట్విట్టర్ లో ఇటు మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇది పక్కన పెడితే అసలు అజిత్ పవార్ ఎవరూ అనే దానిపై చర్చలు నడుస్తున్నాయి… ఆయన ఎవరో కాదు శరద్ పవార్ అన్న కొడుకు… 1982లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన… 1991 లో పూణే జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ (పిడిసి) చైర్మన్‌గా ఎన్నికైన ఆయన 16 సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగారు.
ఇదే సమయంలో బారామతి నుంచి ఎంపీ గా కూడా ఆయన విజయం సాధించారు. ఇక ఆ తర్వాత శరద్ పవార్ కేంద్రంలోకి వెళ్లి రక్షణ మంత్రి కావడంతో ఆయన కోసం… తన పదవిని వదులుకున్న అజిత్… బారామతి నుంచి మహారాష్ట్ర శాసనసభ సభకు ఎన్నికయ్యారు. పవార్ అదే నియోజకవర్గం నుండి 1995, 1999, 2004, 2009 మరియు 2014 లో తిరిగి ఎన్నికయ్యారు. సుధాకరరావు నాయక్ ప్రభుత్వంలో జూన్ 1991 – నవంబర్ 1992 మధ్య కాలంలో వ్యవసాయం మరియు విద్యుత్ శాఖ మంత్రిగా చేసారు.
తరువాత శరద్ పవార్ ముఖ్యమంత్రిగా తిరిగి రాష్ట్రానికి వచ్చినప్పుడు విద్యుత్ మరియు ప్రణాళిక శాఖ మంత్రి (నవంబర్ 1992 – ఫిబ్రవరి 1993) అయ్యారు. 1999 లో భారత జాతీయ కాంగ్రెస్-ఎన్‌సిపి సంకీర్ణం అధికారంలోకి రాగా మరోసారి కేబినేట్ మంత్రి అయ్యారు. మొదట విలాస్రావ్ దేశ్ముఖ్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో (అక్టోబర్ 1999 – డిసెంబర్ 2003). సుశీల్‌కుమార్ షిండే ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖకు (డిసెంబర్ 2003 – అక్టోబర్ 2004) అదనపు బాధ్యతలు ఆయనకు అప్పగించారు. 2019 ఎన్నికల్లో ఆయన బారామతి నుంచి మరోసారి విజయం సాధించారు. ఇప్పుడు బాబాయ్ కి వెన్నుపోటు పాడిచి బిజెపి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు.