టీడీపీకి కంచుకోట వంటిఅనంతపురం జిల్లాలో పెను కుదుపు ఏర్పడింది. దాదాపు ముప్పై ఏళ్లుగా టీడీపీలో పెను అనుబంధం కొనసాగించిన నాయకురాలు కుటుంబంతో సహా పార్టీ సైకిల్ దిగిపోయారు. దీంతో ఒక్క సారిగా జిల్లా వ్యాప్తంగా టీడీపీలో స్తబ్దత ఏర్పడింది. అందరూ కరెంట్ షాక్ కొట్టిన కాకుల మాదిరిగా మారిపో యారు. అన్నగారి హయాం నుంచి టీడీపీలో చక్రం తిప్పిన ప్రస్తుత ఎమ్మెల్సీ శమంతకమణి.. తన కుమార్తె, మాజీ విప్, శింగనమల మాజీ ఎమ్మెల్యే యామినీ బాలలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నేరుగా తాడేపల్లి వచ్చి సీఎం, వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వారు పార్టీ తీర్తం పుచ్చుకున్నారు.
అయితే, ఎందరో పార్టీ మారుతుంటారు.. ఎందరో వస్తుంటారు.. కానీ, కొందరి విషయాన్ని కూడా అందరి విషయంగా లైట్‌గా తీసుకుంటే చంద్రబాబు తప్పులో కాలేసినట్టేనని అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణంగా శింగనమలలో పార్టీ కోసం ప్రచారం చేసి, పార్టీని నిలబెట్టింది శమంతకమణి కుటుంబం. ఎస్సీ వర్గానికి చెందిన ఈ ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. నిస్వార్థంగా, ఎలాంటి వివాదాలు లేకుండానే ఈ కుటుంబం రాజకీయాల్లో ఎదిగింది. అయితే, గత ఎన్నికల్లో చంద్రబాబు యామినీకి టికెట్ నిరాకరించారు. అయినా కూడా వారు పార్టీలోనే ఉన్నారు.
అయితే, ఇటీవల కాలంలో చంద్రబాబు వారిని పట్టించుకోకపోవడం, స్థానిక ఎన్నికల్లోనూ తమ వారికి ప్రాధాన్యం లేకుండా చేయడం, జేసీ దివాకర్, ప్రభాకర్ రెడ్డిల హవా పెరిగిపోవడం(నిజానికి వీరు కూడా జేసీ వర్గానికి మద్దతిచ్చినవారే)తో వారు పార్టీకి కొన్ని వారాలుగా దూరంగా ఉంటున్నారు. ఈ పరిణామాలు తెలిసి కూడా చంద్రబాబు మౌనం పాటించడం, జేసీ వర్గానికి మాత్రమే తాను మద్దతిస్తున్నాననే సంకేతాలు పంపించడంతో శమంతకమణి వర్గం వైసీపీలో చేరిపోయింది. నిజానికి చంద్రబాబు ఈ పరిణామాలను లైట్‌గా తీసుకున్నా.. స్థానికంగా జరుగుతున్న చర్చ, పార్టీ పరిస్థితిని అంచనా వేస్తే.. మాత్రం టీడీపీకి భారీ దెబ్బ తగిలిందని చెప్పకతప్పదు!