కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం జిల్లా విజయనగరం నియోజకర్గం నుంచి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా ఆయన గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఇదే జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణతో ఢీ అంటే ఢీ అనే రాజకీయాలు చేయడంలో కోలగట్ల సిద్ధ హస్తుడు. గతంలో ఇండిపెండెంట్‌గా కూడా పోటీ చేసి విజయం సాధించి .. నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు. ఎప్పుడూ ఏదొ ఒక రూపంలో మీడియాలో సెంట రాఫ్‌ది టాపిక్‌గా నిలబడే కోలగట్ల.. వివాదాలకు కేంద్రంగా కూడా ఉన్నారు. అయితే, తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి వచ్చారు.
ప్రస్తుతం కరోనా విజృంభించిన వేళ.. వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు తమదైన శైలిలో ప్రజలకు సేవ చేస్తున్నారు. పేదలకు ఆహార పొట్లాలు అందించేవారు కొందరు అయితే, కొందరు తమ నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రజలకు శానిటైజర్లను, మాస్కులను పంచారు. అదేసమయంలో నిత్యవసరాలను పంచారు. కొందరు కూరగాయలు పంచుతూ.. తమ ఉదారతను చాటుకున్నారు. ఇలా వైసీపీ నాయకులు తమ దైన శైలిలో గుర్తింపు సాధించారు. మొత్తంగా చూస్తే.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూడా కొందరు ఎమ్మెల్యేలు ఏదో ఒక రూపంలో ప్రజలకు చేరువ అవుతున్నారు. అంతో ఇంతో ప్రజలకు సాయం చేసే దృక్ఫథంతో ముందుకు సాగుతున్నారు.
ఈ క్రమంలోనే విజయనగరం వైసీపీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి కూడా తనదైన శైలిలో పేదలకు నిత్యావసరాలు సహా కూరగాయలు కూడా పంచారు. అయితే, ఈ మాత్రానికే ఆయన మీడియాలో నిలబడలా? ఆయన గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలా? అంటే కానేకాదు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలకు భిన్నంగా కోలగట్ల.. తనదైన శైలిలో వ్యవహరించారు. తన నియోజకవర్గంలో కరోనా సమయంలో విధులు నిర్వహిస్తూ.. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్న కార్మికులను ఆయన పూజించారు. వారి సేవలను కొనియాడుతూ.. పూలు జల్లి .. ప్రశంసించారు. పేరు పేరునా అందరికీ ప్రజల తరఫున, ప్రబుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఇప్పుడు ఆయన హీరోను చేసింది. వైసీపీలో చర్చించుకునేలా చేసింది. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు కోలగట్ల!!