ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో భారీగా లేఆఫ్స్ కొనసాగుతోంది. తాజాగా కోర్ బృందంలోని 200 మంది ఉద్యోగులను ఈ కంపెనీ తొలగించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఏప్రిల్ 25వ తేదీన గూగుల్ తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించగా.. అంతకు ముందే ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. పునర్వ్యస్థీకరణలో భాగంగా ఆ ఉద్యోగాలను భారత్, మెక్సికోకు తరలించినట్లు వెల్లడించింది. అమెరికాలోని కాలిఫోర్నియా, సన్నీవాలేలో ఉన్న కార్యాలయాల్లోని ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొంది.
6 శాతం మంది ఉద్యోగులను తొలిగిస్తామని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా 200 మందికి గుడ్ బై చెప్పింది. తొలగించిన వారికి కంపెనీలోనే ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించినట్లు గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అమెరికా వెలుపల చౌకగా ఉద్యోగాలు లభిస్తుండటంతో భారత్ లాంటి మార్కెట్లకు ఉద్యోగాలను తరలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.