ఫైజర్, బయో ఎన్టెక్లకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ ఇటీవలి కాలంలో వివాదాలకు మారుపేరుగా మారింది. ఆ వ్యాక్సిన్ను తీసుకున్న కొందరు చనిపోవడంతో వ్యాక్సిన్ పనితనంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా నార్వేలో ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది చనిపోవడం కలకలం రేపుతోంది.
కాగా చనిపోయిన 23 మందిలో 13 మందికి వ్యాక్సిన్ వేశాక వచ్చే అనారోగ్య సమస్యలు కనిపించాయి. డయేరియా, వికారం, జ్వరం సమస్యలు వచ్చినట్లు గుర్తించారు. అయితే నార్వే అధికారులు ఈ విషయంపై విచారణ చేపట్టారు. సదరు వ్యక్తులు ఆ వ్యాక్సిన్ వల్లే చనిపోయారా, లేదా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా.. అనే అంశాన్ని వారు విచారిస్తున్నారు. త్వరలోనే ఆ వివరాలు తెలుస్తాయి.
ఎక్కువ వయస్సు ఉన్నవారు ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ను తీసుకున్న తరువాత చనిపోతున్నట్లు నార్వేలో ప్రాథమికంగా నిర్దారించారు. అయితే దీనిపై మరింత లోతుగా విచారణ చేస్తామని తెలిపారు. కాగా డిసెంబర్లో అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా మొత్తం తొలి దశలో 30వేల మందికి ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చారు.