షేక్ హసీనా కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆమె గద్దె దిగగానే అవామీలీగ్ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకొని అల్లరిమూకలు హింసాకాండకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బయోపిక్లో నటించిన ఓ యువ నటుడు, దర్శకుడైన అతడి తండ్రిని నిరసనకారులు దారుణంగా హతమార్చారు.
బంగ్లాదేశ్‌కు చెందిన దర్శకనిర్మాత సలీమ్ ఖాన్ హసీనా తండ్రి జీవితంపై 2021లో ఓ సినిమాను తెరకెక్కించారు. ‘తుంగిపరార్ మియా భాయ్’ పేరుతో నిర్మించిన ఈ సినిమాలో సలీమ్ కుమారుడు, నటుడు శాంతో ఖాన్ హసీనా తండ్రి రెహమాన్ యుక్తవయసు పాత్రను పోషించాడు. సోమవారం రోజున హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయగానే శాంతో, సలీమ్‌ను ఆందోళనకారులు లక్ష్యంగా చేసుకోవడంతో తండ్రీకుమారులు చాంద్‌పుర్‌లోని తమ స్వగ్రామానికి పారిపోయేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యలో ఆందోళనకారులు వీరిని అడ్డుకుని దారుణంగా హతమార్చారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు ధ్రువీకరించారు.