చైనాకు దిగ్గజ వ్యాపార సంస్థ అలీబాబాలో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. ఆ కంపెనీ యాజమాన్యంలో కొత్త మార్పులు వచ్చాయి. ఎనిమిదేళ్లుగా ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న డేనియల్ ఝాంగ్‌ను పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న జోసెఫ్ సాయ్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. టావోబావో, మాల్ ఆన్‌లైన్ వాణిజ్య విభాగాలకు ఛైర్మన్‌గా ఉన్న ఎడ్డీ వూ.. అలీబాబా గ్రూప్‌నకు కొత్తగా సీఈఓగా వ్యవహరించనున్నారు. కంపెనీ షేర్ల పతనం, కొవిడ్ తర్వాత పుంజుకోవడంలో సంస్థ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో నాయకత్వ మార్పు జరగడం గమనార్హం.
కొత్త బాధ్యతలు స్వీకరించనున్న జోసెఫ్ సాయ్, ఎడ్డీ వూ.. ఇరువురూ అలీబాబా సహ- వ్యవస్థాపకుడు ‘జాక్ మా’ కు నమ్మకస్థులు కావడం గమనార్హం. పైగా వీరివురూ కంపెనీ సహ- వ్యవస్థాపకులు కూడా. క్లౌడ్ కంప్యూటింగ్ నుంచి లాజిస్టిక్స్, అంతర్జాతీయ వాణిజ్యంలో కంపెనీని పటిష్ఠపరుస్తామని ఇటీవలే అలీబాబా ప్రకటించింది. ఇందుకోసం ఆరు మార్గాల పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపింది.