పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో బుధవారం రోజున అయిదు చర్చిలపై దాడులు జరిగాయి. జరాన్ వాలాలో ఈ ఘటన జరిగింది. ఓ క్రైస్తవుడు, అతని సోదరి ఖురాన్‌ను అవమానించారని ఆరోపిస్తూ ముస్లిం వర్గానికి చెందిన కొందరు ఈ దాడికి తెగబడినట్లు సమాచారం. క్రైస్తవుడైన రజా అమీర్ మసీహ్, అతడి సోదరి రాకి ఖురాన్‌ను, మహమ్మద్ ప్రవక్తను దూషించారంటూ మసీదుల మైకుల్లో ప్రచారం చేయడంతో, ముస్లింలు గుంపుగా వెళ్లి వారి ఇంటిని కూల్చివేశారని స్థానికులు చెప్పారు. దీంతో భయాందోళనకు గురైన క్రైస్తవులు వేరే ప్రాంతాలకు పరారయ్యారు.
ఈ ఘటనపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఘటనపై విచారణ జరిపి.. శాంతియుత భావప్రకటనా స్పేచ్ఛకు మద్దతివ్వాలని పాకిస్థాన్ అధికారులను కోరింది. హింస, బెదిరింపులకు పాల్పడడం ఎప్పటికీ ఆమోదయోగ్యమైన వ్యక్తీకరణ కాదని తెలిపింది. ఖురాన్‌ను అవమానించారన్న ఆరోపణలతో పాకిస్థాన్ చర్చిలపై దాడులు జరిగిన ఘటనపై ఆందోళన చెందుతున్నామని అమెరికా ప్రకటన జారీ చేసింది. ఈ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపాలని పాక్ అధికారులను కోరుతున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు.