ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ముందు అగ్రరాజ్యం.. అక్కడ నివసించే భారతీయులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికాలో శాశ్వత నివాసం జారీ చేసే గ్రీన్ కార్డు అర్హతలను సరళతరం చేసింది బైడెన్ సర్కార్. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం అర్హతలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వారి కోరికను సాకారం చేసుకునేందుకు ఈ నిర్ణయం దోహదం చేయనుంది.
అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం.. ప్రతియేటా సుమారు 1,40,000 గ్రీన్ కార్డులను జారీచేస్తారు. ప్రస్తుతం మొత్తం దరఖాస్తుల్లో ఒక్కో దేశానికి కేవలం 7% మాత్రమే కేటాయిస్తున్నారు. ఈఏడీ అర్హతలు ఉన్నవారికి మాత్రమే ప్రస్తుతం గ్రీన్ కార్డు జారీ చేస్తున్నారు. తాజాగా ఈఏడీ నిబంధనలను సడలించిన నేపథ్యంలో అమెరికాలో సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం కలగనుంది. గ్రీన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే కాకుండా రెన్యువల్ చేసుకునే వారికి కూడా నూతన మార్గదర్శకాలు వర్తింపచేయనున్నట్లు అమెరికా వెల్లడించింది.